Prabhas బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ ను అమాంతం పెంచిన హీరో ప్రభాస్. తెలుగు సినిమా హీరోలు వేరే ఇండస్ట్రీలకు ఏమాత్రం తీసిపోరని నిరూపించిన మన ప్రభాస్.. వరుసగా పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. బాహుబలి సినిమా తర్వాత అన్ని ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్.. ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కెతో పాటు డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ మధ్యనే రిలీజ్ అయిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. గ్రాఫిక్స్ అస్సలు బాగోలేవని అందరూ గుసగుసలాడటంతో ఆదిపురుష్ టీం సినిమాను వాయిదా వేసింది. ఆదిపురుష్ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ మీద సంతృప్తిగా లేని కారణంగా ఆ విడుదలను వాయిదా వేశారు.
ఆదిపురుష్ సినిమాను 2023 జూన్ 16వ తేదీన విడుదల చేస్తామని ఆ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ అధికారికంగా ప్రకటించారు. ఇది బాగానే ఉన్నా.. ఇప్పుడు సలార్ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లో గుబులు పుట్టిస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎంతో భారీగా నిర్మితమవుతున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆదిపురుష్ వల్ల దీనిపై ప్రభావం పడింది.
Prabhas
కేవలం మూడు నెలల గ్యాప్ లో ప్రభాస్ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో.. సలార్ సినిమాను వాయిదా వేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. భారీ యాక్షన్ సినిమాగా రాబోతున్న సలార్ సినిమాకు, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందని అంతా అనుకుంటే.. ఆది పురుష్ సినిమా వల్ల ఇది కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కు మింగుడుపడని వార్తగా మారింది.