Munugode bypoll : గత ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధిని వెల్లడిస్తూ పార్టీలు జనాల్లోకి వెళ్లేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎదుటి పార్టీ అభ్యర్థిలోని బలహీనతలు, తప్పొప్పుల చిట్టా తీసి వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థిని ఎమోషనల్‌గా దెబ్బతీసేందుకు ప్రత్యర్థి పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు.
ఇప్పుడు ఈ పోస్టర్ల వార్‌నే పార్టీలు మరింత ముందుకు తీసుకెళుతున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. ఈ ఎన్నికలకు ముందు నేతలను ఉద్దేశిస్తూ అక్కడి ప్రజానీకం తమ గ్రామ సమస్యల పరిష్కారానికి ఫ్లెక్సీలను పెట్టేవారు. ఇప్పుడు రివర్స్‌లో రాజకీయ నేతలే తమ ప్రత్యర్థి పార్టీతో పాటు ఆ పార్టీ అభ్యర్థిపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ పోస్టర్లను అంటిస్తున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలుస్తున్నాయి.
ఇక ఈ పోస్టర్లలో సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలను యాడ్ చేశారు. శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టారు. అంతటితో ఆగారా? మరో అడుగు ముందుకేసి జేపీ నడ్డా సమాధి కట్టినందుకు ప్రతీకారంగా కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇక దీనికి ప్రతిగా టీఆర్ఎస్ నేతలు ఏం చేస్తారో చూడాలి. ఇక స్థానిక ప్రజానీకం తమ సమస్యలు తీర్చాలంటూ పోస్టర్లు పెడితే అవి చూసే నాథుడే లేడు. దీంతో స్థానిక ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.