Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నిక పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. పార్టీలన్నీ చావో రేవో అన్నట్టుగా రంగంలోకి దిగాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెడుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉంటాడనేది తెలియకుండా ఉంది. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలు, క్యాడర్‌ను కాపాడుకోవడం కూడా ఆయా పార్టీలకు పెద్ద టాస్క్‌గా మారింది. ఇక ఇక్కడ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకూ బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిస్తే తాజాగా మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి అనుకూల ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. సంస్థాన్ నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. రాజన్న రాజీనామా ఫలించి ఉపఎన్నికలను తీసుకు రావడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయని.. అంతేకాకుండా.. చౌటుప్పల్ కేంద్రంలో 5 డయాలసిస్ యూనిట్లు.. చేనేత బీమా అన్నీ నెరవేరాయని పోస్టర్లలో పేర్కొన్నారు.
మొత్తానికి తనపై వస్తున్న కౌంటర్లకు రాజగోపాల్ రెడ్డి అదే ఫ్లెక్సీల ద్వారా సమాధానం అయితే ఇచ్చేశారు. ఇటీవల రూ.18 కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారానికి సంబంధించి ‘కాంట్రాక్ట్ పే’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా పలు మండలాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవి నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారాయి. కౌంటర్ ఇవ్వకుంటే అదే భావన ప్రజల్లో స్థిరపడిపోతుందని అనుకున్నారో ఏమో కానీ గట్టిగానే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక అక్కడి నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి విజయంపై బెట్టింగ్ ఓ రేంజ్‌లో సాగుతోంది. బెట్టింగ్‌లో తరువాతి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.