Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో సూపర్‌హిట్ అందుకొన్న ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్‌గా ఇది రూపొందింది. మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రాజకీయ కథాంశంతో సిద్ధమవుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ‘గాడ్ ఫాదర్’ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాత్ స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
అంతకు ముందు వచ్చిన మెగాస్టార్ మూవీ ‘ఆచార్య’ దారుణ పరాజయాన్ని మూట గట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అందునా మలయాళంలో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తెలుగులో కూడా తప్పక హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యూనిట్ అంతా రాయలసీమ వెళ్ళడానికి రెడీ అవుతోంది. అనంతపురం జిల్లాలో ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఈ నెల 28న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం.
Megastar Chiranjeevi : మనకు రాజకీయాలు వద్దు బాస్..
అయితే ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకండ్ల ఆడియో చర్చనీయాంశంగా మారింది. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ… రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తుంటే… మరి కొందరు మాత్రం ఇది చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ లోని డైలాగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో… అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.