Pawan Kalyan: సాగరతీరం విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ ప్రభుత్వం హోరా హోరీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. విశాఖ గర్జన పేరిట ప్రభుత్వం, మంత్రులు, వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే, దీనికి కౌంటర్ గా పవన్ కల్యాణ్ విశాఖ నగరంలో జనవాణి కార్యక్రమం పేరిట బాధితుల ఫిర్యాదులు తీసుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలనే సంకల్పంలో భాగంగా ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఓవైపు అమరావతి ఉద్యమానికి కౌంటర్ ఇస్తున్నామనుకుంటే.. మధ్యలో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ మంత్రులు భగ్గుమన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేశారంటూ జనసేన నేతలు పలువురిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామంతో పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముందే అనుమతి తీసుకున్నా ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం సామాన్యులపై ఉక్కుపాదం మోపుతూ, ఎదురు తిరిగే వారిపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు పవన్. జనసైనికులను వెంటనే విడుదల చేయాలని, అప్పటిదాకా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించమని స్పష్టం చేశారు. ఈ పరిణామంపై కూడా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏకంగా పవన్ కల్యాణ్ కే నోటీసులు జారీ చేసింది. పోలీసు ఆంక్షలు అమలులో ఉన్నందున ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించామని, విశాఖను వీడాలని పవన్ కు పోలీసు శాఖ సూచించింది.
Pawan Kalyan: నా పోరాటం ప్రభుత్వంపైనే.. పోలీసులపై కాదు..
పవన్ కల్యాణ్ ఇక విశాఖ నగరాన్ని వీడక తప్పలేదు. ఈ సందర్భంగా పోలీసులంటే తమకు గౌరవం ఉందన్న పవన్.. తమ పోరాటం ప్రభుత్వంపైనే గానీ పోలీసు శాఖపై కాదని వివరణ ఇచ్చారు. అరెస్ట్ అయిన సుమారు 115 మందికిపైగా జనసేన కార్యకర్తలు, నేతలకు బెయిల్ ఇప్పించే కార్యక్రమం కొనసాగుతోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు పవన్. ప్రభుత్వ ఆంక్షలతో విశాఖను వీడుతున్నానన్నారు. తాను బయటకు వచ్చి అభివాదం చేయడానికి కూడా ఆంక్షలు అడ్డు వస్తున్నాయన్నారు. చివరకు విశాఖ నుంచి బయల్దేరి గన్నవరం చేరుకున్నారు పవన్.