వైసీపీ ప్రభుత్వం జనవరి నుంచి కొత్త పెన్షన్ ల విధానం తీసుకొస్తుంది. తమ హామీలో భాగంగా పెన్షన్ ని 2750కి పెంచింది. ఆ పెంచిన మొత్తం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ పెన్షన్ సొమ్ము పెంచడంతో పాటు కొత్త మెలిక పెట్టింది. పెన్షన్ తీసుకుంటున్న వారి అర్హతకి మరోసారి పరీక్ష పెట్టిన సంగతి తెలిసిందే. పెన్షన్ లు అందుకుంటున్న వారి పేరు మీద ఏవైనా స్థిరచరాస్తులు ఉన్నాయా, అలాగే ఇప్పుడు వారు ఉంటున్న ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేవి పరిశీలిస్తుంది. అయితే గతంలో స్థిరచారాస్తులు ఉండి, ప్రస్తుతం పేదవారిగా ఉన్నా కూడా అలాంటి వారికి కూడా నోటీసులు జారీ చేసి తమ అర్హతని నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దానికి సమయం కూడా చాలా తక్కువ ఇచ్చింది. ప్రభుత్వం పెన్షన్ వెరిఫికేషన్ ద్వారా సుమారు 15 లక్షల పెన్షన్ లని తొలగించడానికి ప్లాన్ చేస్తుందని ప్రతిపక్షాల ఆరోపణ. దానికి వారు బలమైన కారణాలు కూడా చూపిస్తున్నారు. అయితే జగన్ మాత్రం పెన్షన్ వెరిఫికేషన్ పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కలెక్టర్ లు అందరూ మీటింగ్ పెట్టి ప్రతిపక్షాలని తిట్టడం పనిగా పెట్టుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారు. ఈ ఆదేశాలపై వైసీపీ పార్టీలోనే వ్యతిరేకత వినిపిస్తుంది. ఇక ప్రతిపక్షాలు అయితే ట్రోలింగ్ తో జగన్ ని ఆడుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ పెన్షన్ ల తొలగింపుపై తమ పోరుని మొదలు పెట్టింది. జిల్లాల వారీగా ఆందోళనలకి పిలుపునిచ్చింది. వీరికి వామపక్షాలు కూడా తోడయ్యాయి.
ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఈ పెన్షన్ ల తొలగింపుపై జగన్ కి బహిరంగ లేఖ రాసారు. ఆ లేఖలో పెన్షన్ ల రీసర్వే సహేతుకంగా లేదని ఎత్తి చూపించారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు కూడా నోటీసులు ఇచ్చారని, వారి పేరిట వేల ఎకరాల భూములు ఉన్నాయని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని, వాటి ప్రకారం ఆ వృద్ధులకి భూములు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే పెనుకొండ మండలంలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే మహిళ పేరిట 158 ఇళ్లు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారని, అవే నిజమైతే ఆ ఇళ్ళ తాళాలు, వాటి పత్రాలు రామక్కకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా ఎంతో మంది పెన్షనర్స్ కి లేని ఆస్తులు చూపిస్తూ నోటీసులు జారీ చేయడంపై పవన్ కళ్యాణ్ విమర్శలు సంధించారు. పెన్షన్ లబ్దిదారులని తగ్గించడానికి వైసీపీ కొత్త కొత్త విధానాలు అన్ని తెరపైకి తీసుకొస్తుందని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.