హైదరాబాద్ వేదికగా చంద్రబాబు నాయుడు ఇంట్లో పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా జరిగిన భేటీ కావడంతో ఏపీ రాజకీయాలలో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇద్దరు ఇంట్లో రెండు గంటలకి పైగా చర్చించడంతో కచ్చితంగా రాబోయే భవిష్యత్తు కార్యాచరణ, అలాగే పొత్తులపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే భేటీ అనంతరం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. కుప్పం పర్యటనలో చంద్రబాబుని అడ్డుకున్న నేపధ్యంలో కేవలం పరామర్శించి తన సంఘీభావం తెలియజేయడానికి వచ్చినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తులపై తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, ఇప్పుడు అది ప్రాధాన్యత అంశం కూడా కాదని తేల్చేశారు.
తాము ముఖ్యంగా ప్రతిపక్షాలని అణచివేయడానికి వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై ఎలా ముందుకి వెళ్ళాలి. దానిని అడ్డుకోవడానికి ఏం చేయాలనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల తొలగింపు, రైతులకి గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాల మీద చర్చించినట్లు తెలిపారు. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం పదే పదే చేస్తుందని. తనని వైజాగ్ లో అడ్డుకుంటే ఇప్పుడు చంద్రబాబుని కుప్పంలో అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. జీవో నెంబర్ 1 ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణతో ప్రతిపక్షాలని కలుపుకొని పోరాటం చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవోలని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. జీవోకి కారణంగా కందుకూరు, గుంటూరు ఘటనలని చూపుస్తుందని అన్నారు. అయితే ఆ ఘటనల వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని, దానిని పోలీసులు అమలు చేసారని విమర్శించారు. పోలీసులు వైసీపీకి బానిసలుగా మారి పనిచేస్తున్నారని దయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు అన్ని కలిసి ఈ చీకటి జేవోపై ఉమ్మడి పోరాటం చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు పొత్తులపై మాట్లాడుతామని, ఎవరి పార్టీ విధానాలకి తగ్గట్లుగా వారు అప్పుడు ఎన్నికలకి వెళ్తారని అన్నారు. పొత్తులు పెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో కొత్తేమీ కాదని అన్నారు. తమ తక్షణ కర్తవ్యం మాత్రం కేవలం ప్రతిపక్షాలుగా తమ హక్కులని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే అని చంద్రబాబు పేర్కొన్నారు.