సినిమా హీరోలు షూటింగ్ లు ఒకే చోట జరిగినపుడు ఏదో సరదాగా కలుసుకోవడం ఇండస్ట్రీలో ఆనవాయితీగా ఉంటుంది. స్టార్ హీరోలు అలా కలుసుకున్నప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇదే పద్ధతిలో తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో బాలకృష్ణ వీరసింహారెడ్డి, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఒకే చోట జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ వీరసింహారెడ్డి షూటింగ్ లొకేషన్ కి వెళ్లి బాలకృష్ణని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఫోటోలని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలుసుకునే ఫోటోలు ట్విట్టర్ లో వైరల్ కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
గత కొద్ది రోజులుగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2కి త్రివిక్రమ్ తో కలిసి పవన్ కళ్యాణ్ హాజరవుతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా త్రివిక్రమ్ కి కాల్ చేసి ఎవరితో రావాలో తెలుసుకదా అనే మాట చెప్పి దీనికి బలం చేకూరేలా చేసారు. ఇక నిర్మాత నాగవంశీ కూడా ట్విట్టర్ లో ఈ విషయాన్ని అనధికారికంగా దృవీకరించారు. అయితే ఇద్దరు హీరోలు కలుసుకోవడం సాధారణమైన విషయమే అయిన ఇద్దరు కూడా ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలలో ఉన్నవారే. బాలకృష్ణ ఎమ్మెల్యేగా టీడీపీలో ఉంటే, పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
అలాగే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా జరిగే నష్టం ఏంటనేది కూడా వైసీపీ నేతలకి, అధిష్టానంకి భాగా తెలుసు. ఈ నేపధ్యంలో షూటింగ్ సెట్ లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ హడావిడి మొదలెట్టింది. వారిద్దరూ పది నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారని ప్రచారం తెరపైకి తెచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయాడు అనేదానికి ఇదే ఉదాహరణ అని ప్రచారం చేస్తున్నారు. అలాగే వీలైనంత వరకు వీరి కలయికని తప్పుడు కోణంలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ జనసైనికులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలు పెట్టారు.