ఒకప్పుడు టాలీవుడ్ సినిమా అంటే ఒక రీజనల్ భాషగా మాత్రమే దేశ వ్యాప్తంగా ట్రీట్ చేసేవారు. తెలుగు సినిమా నటులని జాతీయ స్థాయిలో గుర్తించడం కూడా తక్కువగా ఉండేది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే అనే విధంగా ఉండేది. నార్త్ ఇండియాలో అలాగే జాతీయ న్యూస్ చానల్స్ కూడా హిందీ సినిమాలని ప్రమోట్ చేసిన స్థాయిలో తెలుగు సినిమాలని చేసేవారు కాదు. అయితే దేశంలోనే హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు ఉన్న చిత్ర పరిశ్రమ అంటే టాలీవుడ్ అని చెప్పాలి. ఆ తరువాత స్థానంలో కోలీవుడ్ వస్తుంది. కమర్షియల్ ఫార్ములాతో సినిమాలని సక్సెస్ కొట్టి ప్రేక్షకులకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇండియన్ నేటివిటీ మిస్ కాకుండా కథలని అందించే దర్శకులు, రచయితలు టాలీవుడ్ లో ఎక్కువ అనే మాట కచ్చితంగా ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే.
బాహుబలి సిరీస్ తో మొదటిసారి తెలుగు సినిమా సత్తా ఏంటి అనేది ఇండియా మొత్తం తెలిసింది. మళ్ళీ ఈ ఏడాది ఇండియన్ సినిమాపై టాలీవుడ్ జెండా మరోసారి ఘనంగా ఎగిరింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలు అనే రేంజ్ కి గుర్తింపు వచ్చింది. బలమైన కథలతో భారతీయత సినిమాలో రిప్రజెంట్ చేస్తూ ప్రతి ఒక్క ఇండియన్ ఇది మా సినిమా అని గర్వపడే రేంజ్ లో ఈ ఏడాది కొన్ని తెలుగు సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రపంచ స్థాయిలో గుర్తింపుని కూడా పొందాయి. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులతో ప్రశంసలు సొంతం చేసుకున్నాయి. అలా పాన్ ఇండియా లెవల్ లో టాలీవుడ్ ఇమేజ్ ని పెంచిన చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉంటుంది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకి పైగా కలెక్ట్ చేయడంతో పాటు. ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడుతుంది. హాలీవుడ్ దర్శకులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్, టేకింగ్, రామ్ చరణ్, తారక్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీని తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటింది కార్తికేయ 2. చిన్న సినిమాగా తెరకెక్కిన పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ సక్సెస్ అందుకుంది. దైవత్వాన్ని, ఆధునికతకి ముడిపెడుతూ, కృష్ణతత్వాన్ని అద్బుతంగా ఆవిష్కరించిన చిత్రంగా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది.
తరువాత దుల్కర్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టొరీ సీతారామం కల్ట్ క్లాసిక్ మూవీగా దేశ వ్యాప్తంగా ప్రశంసలు సొంతం చేసుకుంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ కళాత్మకంగా ఉంటూ క్లాసిక్ సినిమాలని కోరుకునే వారికి విపరీతంగా నచ్చేసింది. ఇక ఈ ఏడాది చివర్లో వచ్చిన సమంత యశోద సరికొత్త పాయింట్ తో మెడికల్ మాఫియా కథాంశంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్ లో టాలీవుడ్ సత్తా చాటించింది. ఇలా టాలీవుడ్ ఇమేజ్ ని ఈ సినిమాలు దేశ వ్యాప్తంగా ఆకాశానికి ఎత్తేశాయని చెప్పాలి.