Padmarao: తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుండడం.. జనరల్ ఎలక్షన్స్ కూడా సమీపిస్తుండడం.. ఈ కారణాలతో రాజకీయ పార్టీలు వారి వారి వ్యూహాలతో వేగంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికల ముందర వివిధ రాజకీయ కారణాలు, వ్యక్తిగత కారణాలతో కొంతమంది నాయకులు పార్టీలు మారడం తంతుగా మారిపోయింది. ఇలా పార్టీలు మారడానికి రెడీగా ఉన్న నాయకులను ఇతర పార్టీలు గాలం వేసి లాగడం సహజమే.. అయితే ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక వల్ల తెలంగాణాలో వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయ రణరంగం వేడెక్కింది.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రణాలికలో భాగంగానే TRS తో పాటు ఇతర పార్టీలలో ఉన్న నాయకులను తమ పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది నాయకులు బీజేపీలో చేరడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తుంది. టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరడంతో తెరాస వర్గాలు అప్రమత్తమైనట్టు సమాచారం. ఇక పార్టీలో ఉన్న ఇతర అసంతృప్తులను బుజ్జగిస్తున్నారట..
ప్రస్తుతం తెరాస నుండి మరో కీలక నేత బీజేపీ నేతలతో టచ్ లో ఉండడంతో.. ఆ నేత కూడా బీజేపీ కండువా కప్పుకుంటాడని విస్తృత ప్రచారం జరుగుతుంది. తెలంగాణ డిప్యూటీ స్పీకర్, టీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్, కిషన్ రెడ్డితో క్లోస్ గా ఉండడంతో కొందరు ఈ వార్తను బలంగా ప్రచారం చేసారు. పద్మారావు బీజేపీలో చేరడం ఖాయమని.. అందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పద్మారావుగౌడ్ ఇంటికి వెళ్లాడని ప్రచారం సాగింది. అయితే వీటన్నింటికీ వివరణ ఇస్తూ ఆ వార్తలకు తెరదించారు పద్మారావు గారు.
Padmarao:
కిషన్ రెడ్డితో తనకు ఎప్పటి నుండో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో అసెంబ్లీలో కూడా పక్కపక్కనే కూర్చున్నామని.. తెలియజేసారు. అయితే ఇటీవల తన కొడుకు వివాహానికి ఆహ్వానించగా.. కొన్ని కారణాల వల్ల కిషన్ రెడ్డి హాజరు కాలేదట. అందుకే ఆ తర్వాత ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసారని వివరణ ఇచ్చారు పద్మారావు గారు. ఇక తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. జీవితాంతం తెరాస లోనే కెసిఆర్ వెనకాలే ఉంటానని స్పష్టం చేసారు. మునుగోడులో ప్రజలు తెరాసకే పట్టం కడతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.