మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే. అతని భద్రత టీమ్ లో ఎన్ఎస్జీ కమాండోల టీమ్ ఉంటుంది. ఈ మధ్య జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలలో అడుగడుగున వైసీపీ శ్రేణులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అలాగే భౌతిక దాడులకి పాల్పడటం చేస్తున్నారు. లైట్స్ ఆర్పేసి రాళ్ళు విసరడం కూడా చేస్తున్నారు. అయితే వెళ్ళిన ప్రతిసారి వైసీపీ శ్రేణుల నుంచి చంద్రబాబుపై దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు కనీసం ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. అలాగే అతని పర్యటనని దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు, కార్యకర్తలని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు మాజీ ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంది అంటే శాంతిభద్రతలకి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు.
అయితే చంద్రబాబు పర్యటన చేస్తున్న ప్రాంతాలలో పోలీసుల నుంచి ఎలాంటి భద్రత చర్యలు కనిపించడం లేదని టీడీపీ నాయకులు పదే పదే చేస్తున్న ఆరోపణలు. అయితే వీటిని పోలీసులు తోసిపుచ్సుతున్నారు. కాని వరుసగా చంద్రబాబు పర్యటనలలో జరుగుతున్న దాడులని చూస్తూ ఉంటే మాత్రం కాస్తా అనుమానంగా ఉంది. అయితే సీబీఎన్ పై కావాలని వాళ్ళ పార్టీ నాయకులతోనే దాడులు చేయించుకొని సింపతీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబుపై జరుగుతున్న భౌతిక దాడుల నేపధ్యంలో అతనికి సెక్యూరిటీగా ఉన్న ఎన్ఎస్జీ కమాండో టీమ్ కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది.
పోలీసులు దాడులని నియంత్రించే ప్రయత్నం చేయడం లేదని గ్రహించి, ఆ బాద్యతని ఇకపై తామే తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో నిఘా సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబుపై దాడుల విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. దీంతో తాజాగా చంద్రబాబు భద్రతపై ఎన్ఎస్జీ రివ్యూ చేపట్టింది. ఈ నేపధ్యంలో పర్యటనల సమయంలో భద్రత విషయంలో ఎలాంటి వ్యూహాలని అమలు చేయాలని అనేది చంద్రబాబు సెక్యూరిటీ టీమ్ కి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఆయన మాట్లాడే సమయంలో కూడా సమీపంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఉండే విధంగా సూచనలు చేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు వైసీపీ శ్రేణుల నుంచి జరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ముందస్తుగానే అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది.