AP POLITICS: ఆంధ్రప్రదేశ్ లో రాజధానుల పేరుతో రాజకీయ క్రీడ మొదలైంది. ఓవైపు అమరావతి రాజధాని కోరుతూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో విశాఖ గర్జన పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. టీడీపీ మాత్రం ఎప్పటి మాదిరిగానే అమరావతినే రాజధాని అని స్టాండ్ తీసుకుంది.
ఓ వైపు ఉత్తరాంధ్రలో విశాఖ గర్జన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మరోవైపు ప్రజావాణి పేరుతో జనసేన అదినేత పవన్ కళ్యాన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు. దీంతో అసలు రగడ మొదలైంది. విశాఖలో గందరగోళం నెలకొంది. పవన్ ర్యాలీ చేస్తున్న క్రమంలో ప్రభుత్వం పవర్ కట్ చేయించింది. మరోవైపు వైసీపీ ముఖ్య నాయకుల కార్ల మీద రాళ్లదాడి జరిగింది.

ఈ దాడి జనసేన కార్యకర్తలే చేశారంటూ సుమారు 100 మందిపై కేసులు పెట్టినట్లు సమాచారం. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య రాజకీయ రణరంగం మరోసారి వాడీవేడిగా సాగింది. వైసీపీ నాయకులు జనసేన పార్టీపై విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందిచడం జరిగింది.
విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని, అరెస్ట్ చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ గదులను సోదా చెయ్యడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని, విశాఖలో వైసీపీ రాజకీయ యాత్ర తుస్ మనడంతో… ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్లు కనిపిస్తుందని లోకేష్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సెటైర్ వేశారు.