సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహరెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి వస్తున్నా కూడా భారీ హైప్ క్రియేట్ చేసుకున్నాయి. రెండు సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయనే నమ్మకంతో నిర్మాతలు సైతం ఉన్నారు. ఇక రెండు కూడా మాస్ కమర్షియల్ జోనర్ లోనే తెరకెక్కిన సినిమాలు కావడంతో సంక్రాంతి ప్రేక్షకులకి మాస్ బొనంజాగా అలరించడానికి రెడీ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చాలా సార్లు ఫ్యాన్స్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా కూడా అది ఫ్రెండ్లీ వార్ గా ఉంటుందని చాలా సందర్భాలలో సదరు హీరోలు క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు హీరోల చుట్టూ రాజకీయ రంగు అలుముకుంది. రాజకీయ పార్టీల ఫ్యాన్స్ ఆయా హీరోలని వోన్ చేసుకోవడం లేదంటే ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఓ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ కి రాజకీయం అంటుకుంది. అయితే ఈ సారి చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ జరిగే అవకాశం ఉందా అంటే అవుననే హెచ్చరిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అయితే ఈ ఫ్యాన్స్ వార్ ని సృష్టించేది నిజమైన ఫ్యాన్స్ కాదని, వైసీపీ సోషల్ మీడియా టీమ్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఫ్యాన్స్ ముసుగులో ఫ్యాన్ వార్ సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు.
సోషల్ లో ఆయా హీరోల పేరుతో ఫ్యాన్స్ పేజీలు క్రియేట్ చేసి వాటి ద్వారా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్ అందరూ వారి ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హీరోల ఫ్యాన్స్ ముసుగులో కులాల మధ్య గొడవ సృష్టించాలని వైసీపీ భావిస్తున్నట్లు నారా లోకేష్ హెచ్చరించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు చాలా కేర్ ఫుల్ గా ఉండాలని అన్నారు. రెండు సినిమాలు సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతున్న సందర్భంగా రెండు పెద్ద హిట్ అవ్వాలని నారా లోకేష్ ఆశించారు.