Nagababu : ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఫైర్ అయ్యారు. ఆమె మంత్రిగా తాను నిర్వహించాల్సిన బాధ్యతలను మరచి మెగాస్టార్, పవర్ స్టార్ ల గురించి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటంపై మండిపడ్డారు. ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేసి రోజా మంత్రిగా చేయాల్సిన బాధ్యతలను గుర్తుచేశారు నాగబాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారతదేశ పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉంటే టాప్ 20 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మాత్రం 18 స్థానంలో ఉందని దీనిని బట్టి ఏపీలో పర్యాటకరంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చునని నాగబాబు పేర్కొన్నారు. నువ్వు ఇలాగే మంత్రిగా నీ బాధ్యతలు మరిచి ఈ శాఖ గురించి ఆలోచించకపోతే ఆంధ‌్రప్రదేశ్ ను చివరి స్థానంలోకి అతి త్వరలోనే తీసుకెళ్లిన ఘనత నీకే దక్కుతుందని అన్నారు. ఏపీ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రతుకుతున్నారని , కానీ ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత వారి జీవితం మట్టికొట్టుకుపోయిందన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని అది మరిచి నువ్వు పర్యటనలు చూయడం కాదని ఆయన రోజా బాధ్యతలను గుర్తు చేశారు.

ఇన్ని రోజులు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నువ్వు నోటికి వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఏమీ అనలేదని అందుకు కారణం లేకపోలేదని అన్నారు నాగబాబు. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్దగా తేడా లేదని అందుకే చూస్తూ చూస్తూ మున్సిపాలిటీ కుప్పతొట్టి దగ్గరకు వెళ్లడానికి ఎవ్వరు ఇష్టపడతారు చెప్పు అందుకే నేను నీ జోలికి రాలేదు అని అన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చకుని పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలి అనే అంశాలపై ఆలోచన చేయాలన్నారు.
ఇక పవన్ పై రోజా చేసిన కామెంట్స్‌ను చూస్తే, పవన్ కళ్యాణ్ మానవత్వం , ఎమోషన్స్ లేనివాడని ఆయన తోటి ఆర్టిస్ట్ ను అయినందుకు సిగ్గుపడుతున్నానని మీడియా సమావేశంలో రోజా తెలిపారు. ఆర్టిస్టులు చాలా ఎమోషనల్ గా ఉంటారు అని అన్నారు. వీరిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చిన ప్రజలకు కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాల్లో కూడా చేయలేదు కాబట్టే అన్నాదమ్ములు ముగ్గురిని సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడించారన్నారు. పవన్ కళ్యాణ్ సరైన సమయంలో స్పందిస్తేనే ప్రజలు మద్దతు ఇస్తారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో అప్పుడు చంద్రబాబుకు సపోర్టివ్ గా మాట్లాడతారని ఇదంతా చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి పవన్ ఎంత విధేయతగా ఉన్నాడో అర‌్ధం చేసుకోవచ్చునని అన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజలు త్వరలోనే రాజకీయ సమాధి కడతారన్నారు. ఈ మాటలను ప్రతిస్పందనగానే నాగబాబు ట్విట్టర్ లో రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Advertisement