Munugodu: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో కాక రేపుతోంది. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. దుబ్బాక, హుజూరాబాద్ లలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు నిరాశ ఎదురుకాగా.. మునుగోడును ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు. అందుకే సర్వశక్తులను ఒడ్డుతోంది.
మంత్రులు ఇప్పటికే మునుగోడులో మకాం వేసి.. టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ టాప్ లీడర్లుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావులు కూడా మునుగోడులో మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు స్థానాన్ని జార విడుచుకోవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధంగా లేరు. అందుకే తాను కూడా స్వయంగా ప్రచారానికి సిద్ధమయ్యారు.
క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవడానికి మంత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా.. ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఏకంగా ఉద్యోగులకు మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించాలని వార్నింగ్ ఇచ్చిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక మంత్రి ఇలా చేయడం ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి.
Munugodu: ఇంతకీ ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడారంటే?:
‘ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఉందంటే ఏంటో అర్థమవుతోందా? ఆల్రెడీ ఫైల్ తయారైంది. అది అయితేనే నేను సంతకం పెడతా. ఎవరైనా సరిగ్గా పనిచేయక తేడా వస్తే నా పని అయితది. అంతటా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేస్తున్నారు. మీరు బాగా పనిచేస్తున్నారన్న రిపోర్టు రావాలి. ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని కేసీఆరే కాపాడతారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేయలేం. మీతో ఏర్పాటు చేస్తే ఏం కాదు. మీరు బహిరంగంగా పనిచేయవచ్చు’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు సెర్ప్ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.