Munugodu: తెలంగాణలో రసవత్తరమైన ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక రాగా.. ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. గత ఉప ఎన్నికల్లో వరుస వైఫల్యాలతో నిరాశలో ఉన్న టీఆర్ఎస్ ఈసారి మునుగోడులో గెలవాలని గట్టిగా భావిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికలో కారు చక్రం తిప్పేందుకు మంత్రులు ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారానికి దిగారు. ఇక పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్ మరియు హరీష్ రావులు ఎన్నికలు అయ్యేంత వరకు మునుగోడుకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కేటీఆర్, హరీష్ రావులు మునుగోడులో పార్టీ జెండా ఎగరేయాలని భావిస్తున్నారట.
ఇక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు హాజరైన మంత్రి కేటీఆర్.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని ప్రకటించారు. దీంతో సిరిసిల్ల ఎలాగైతే అభివృద్ధి చెందిందో, అదే విధంగా మునుగోడు కూడా అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ వర్గాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి.
Munugodu: ఓ మంత్రి ఇలా ప్రచారం:
మునుగోడులో ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం అందరిలో ఆసక్తిని, చర్చను రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ కరపత్రాన్ని ఓటర్లకు చూపిస్తూ.. కేసీఆర్ మన ప్రస్తుత ముఖ్యమంత్రి అని, కేటీఆర్ మన కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారట. కాబోయే ముఖ్యమంత్రే మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెబితే.. ఇంక భయమెందుకు, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన అభ్యర్థిస్తున్నారట. మొత్తానికి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండబోరనే సంకేతాలు మరింత బలపడుతున్నాయి.