Munugodu ఎన్నికల నియమావళి ప్రకారం.. ఎలక్షన్ కోడ్ ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీకి లబ్ది చేకూరే విధంగా ఎలాంటి పథకాలు, అభివృద్ధి పనులు చేయకూడదు. అలా చేస్తే అది ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాటిని నిలిపివేస్తుంది. అయితే ప్రస్తుతం తెలంగాణాలో మునుగోడు స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో ఇలాంటి నిబంధనలే అధికార తెరాస పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ తెరాసకు తగిలిన ఎదురు దెబ్బలు ఏంటి.. వాటిని అధికార పార్టీ ఎలా ఎదుర్కోవాలని అనుకుంటుంది.. మీరే చదవండి.
తెరాస లోని కొందరు అసంతృప్త నేతలు బీజేపీతో టచ్ లో ఉండడం.. ప్రచారంలో తెరాస అభ్యర్థి తరపున ప్రచారం చేయకపోవడం తెరాసను కొంత నిరుత్సాహపరుస్తున్నాయి. అంతే కాకుండ ఇటీవల విడుదల చేసిన పార్టీ గుర్తులు, స్వతంత్రులకు కేటాయించిన గుర్తులు కారు గుర్తుని పోలి ఉన్నాయి. వాటి ద్వారా తెరాసకు ఓటు వేయాలనుకునే వారు.. పొరపాటున కారు గుర్తుని పోలి ఉన్న వేరే గుర్తుకు ఓటు వేయవచ్చని.. దీని ద్వారా తెరాసకు నష్టం జరుగుతుందని భావించి.. ఆ పార్టీ హై కోర్టుకు వెళ్ళింది. అయితే ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న హై కోర్ట్ TRS పిటిషన్ ని కొట్టివేసింది. ఎలక్షన్ ప్రాసెస్ లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.
ఇక తాజాగా గొర్ల పంపిణి పథకంలో భాగంగా మునుగోడులో గొల్లకురుమలకు గొర్రెలకు బదులుగా, నగదు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మునుగోడులో గొర్రెల పంపిణీ స్థానంలో నగదు బదిలీ చేయడం సరికాదని.. ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇది అధికార తెరాస పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక కమ్యూనిటీకి చెందిన ఓట్లు దోచుకోవడానికే ఈ పథకం అని ప్రతి పక్షాలు విమర్శిస్తుండగా.. టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం విపక్షాలు దీనిపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టారు.
Munugodu
ఏదేమైనా కానీ ఎన్నికల తరువాత ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి.. గొల్లకురుమలకు న్యాయం చేస్తామని మంత్రి తలసాని తెలిపారు. ఈ పథకాన్ని ప్రస్తుతం అడ్డుకోవడం టీఆర్ఎస్ కు మైనస్ గా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. మునుగోడులో ముదిరాజ్ కమ్యూనిటీ తరువాత అత్యధిక ఓట్లు కలిగి ఉన్నది గొల్ల కురుమ కమ్యూనిటీయే.