Munugodu: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక తారాస్థాయికి చేరుకుంది. ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. వచ్చే నెల 3న పోలింగ్ జరగనుంది. మునుగోడును తిరిగి నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్, ఇజ్జత్ మే సవాల్ గా బీజేపీలోకి జంప్ అయిన కోమటిరెడ్డి, అధికార పార్టీగా తామేంటూ నిరూపిస్తాం.. అంటూ టీఆర్ఎస్.. ఇలా మూడు పార్టీలో రాజకీయ రణక్షేత్రాన్ని తలపించేలా ప్రచారం చేస్తున్నాయి.
దాడి, ప్రతిదాడులతో టెన్షన్ టెన్షన్..
ప్రచారంలో రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, కానుకలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకొనే యత్నాలు చేస్తున్నారు నేతలు. పోలింగ్ టైమ్ దగ్గర పడే కొద్దీ మునుగోడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ పై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా మరుసటి రోజు బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చెప్పులు విసిరారు కాంగ్రెస్ కార్యకర్తలు. జైకేసారం గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా రాజగోపాల్ రెడ్డికి ఈ చేదు అనుభవం ఎదురైంది.
ఇలా మునుగోడులో దాడులు చేసుకొనే స్థాయికి రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 289 పోలిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 105 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి భద్రత పెంచారు. పోలింగ్ సమయంలో కూడా ఘర్షణలు, ఆందోళనలు చెలరేగే ఆస్కారం ఉన్న ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు.
Munugodu:
ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు బందోబస్తుతో పాటు కేంద్ర పారా మిలటరీ బలగాలకు చెందిన 3,350 మందిని మునుగోడుకు ఎన్నికల విధుల నిమిత్తం దింపారు. మరోవైపు మునుగోడులో నోట్ల కట్టలు కూడా గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రధాన పార్టీలు కార్లలో, ఇతర వాహనాల్లో భారీగా డబ్బు కట్టలు మునుగోడుకు చేరవేస్తున్నారు. వీటిలో చాలా వరకు పోలీసులు పట్టుకుంటున్నారు.