Munugodu: తెలంగాణలో ఎంతో ఉత్కంఠను రేపిన మునుగోడు ఫలితం ఇవాళ తేలనుంది. అన్ని పార్టీలు మునుగోడును సొంతం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయగా.. బీజేపీ, టీఆర్ఎస్ లు అయితే సర్వశక్తులు ఒడ్డాయి. మునుగోడులో కారు గెలుపు కోసం మంత్రిమండలిలోని అందరూ అక్కడ మకాం వేయగా.. బీజేపీ కోసం కేంద్ర మంత్రులు బరిలోకి దిగారు. మొత్తానికి మునుగోడు ఫలితాలు అన్ని పార్టీల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
మునుగోడు బరిలో మొత్తం 47మంది పోటీ చేయగా. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా దృష్టిని బాగా ఆకర్షించారు. ఉంగరం గుర్తు మీద పోటీ చేసిన కేఏ పాల్.. ముందు నుండి ఎంతో దూకుడుగా మునుగోడు బరిలో దూసుకెళ్లారు. మునుగోడును ఎలాగైనా గెలుస్తామని, గెలిచాక మునుగోడును అమెరికా చేస్తామంటూ కేఏ పాల్ వెల్లడించారు. సుడిగాలి పర్యటనలు, ఎన్నికల ప్రచారం వేళ రకరకాల విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నాడు.
మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ 50వేల మెజార్టీతో గెలుస్తుందని చెప్పిన ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్.. తర్వాత వచ్చిన ఓట్లను బేరీజు వేసుకున్నట్లున్నారు. అందుకే తాము గెలవబోయేది లేదనే స్పష్టతకొచ్చి.. ఏ పార్టీ గెలవబోతుందనే ఒక అంచనాను చెప్పారు. మొత్తానికి 50వేల మెజార్టీతో తమ పార్టీ గెలుస్తుందని ముందు నుండి చెప్పిన కేఏ పాల్.. ఇప్పుడు మాత్రం వేరే పార్టీ గెలుస్తుందని జ్యోతిష్యం చెప్పారు.
Munugodu:
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీ అని కేఏ పాల్ జోష్యం చెప్పారు. బీజేపీ నుండి బరిలో నిలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు సాధిస్తారని కేఏ పాల్ అన్నారు. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానమైన పోటీ సాగుతున్న నేపథ్యంలో కేఏ పాల్ బీజేపీ గెలుస్తుందని చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.