Munugodu: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడులో ఎలాగైనా గెలిచి జనరల్ ఎలక్షన్ కు ముందు సిద్ధం కావాలని అన్ని పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఈ ఎన్నిక ఇప్పుడు బీజేపీకి, కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ కు ఛాలెంజ్ గా నిలుస్తోంది.
ఎన్నికలు అంటేనే మాటలు, మూటల ప్రవాహం. ఎన్నికలు వచ్చాయంటే ఎక్కడెక్కడి నుండి నాయకులు అక్కడికి చేరుకొని, రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. అదే సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బును పంచుతూ ఉంటారు. ఇప్పుడు మునుగోడులోనూ ఇదే ప్రయత్నం జరుగుతోంది. అన్ని పార్టీలకు నువ్వే నేనా అన్నట్లు సాగుతున్న ఈ ఎన్నికలో పంచడానికి డబ్బులు సిద్ధం చేస్తున్నారు.
ఈక్రమంలో పోలీసులు మునుగోడు వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ బీజేపీ నేత కారులో ఏకంగా కోటి రూపాయలు పట్టుబడటం సంచలనంగా మారింది. బీజేపీ నేత కారును మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆపి.. తనిఖీలు చేయగా అందులో ఏకంగా కోటి రూపాయల నగదు కనిపించింది. దీంతో వెంటనే కారును, డబ్బును సీజ్ చేయడంతో పాటు అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు.
Munugodu:
బీజేపీ నేత కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వేణుకు సంబంధించిన వాహనంగా సదరు కారును గుర్తించిన పోలీసులు.. అంత డబ్బు ఎక్కడిది, ఎక్కడికి తీసుకెళుతున్నారని విచారిస్తున్నారు. కాగా ఎన్నిక కోసమే హవాలా రూపంలో ఈ నగదు మునుగోడు చేరినట్లు అనుమానాలు ఉండగా.. ఇలాంటివి ఎన్ని జరుగుతాయో అనే అనుమానాలున్నాయి. కాగా హైదరాబాద్ లోని పలుచోట్ల భారీగా హవాలా డబ్బు పట్టుబడుతుండటం తెలిసిందే.