Munugodu: తెలంగాణలో ఎన్నికల సమరం మొదలయ్యింది. మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తుండంతో, ప్రధాన పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇదే పనిలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ లో మునిగిపోయింది. ఉప ఎన్నికతో పాటు, తెలంగాణ కాంగ్రెస్ కి మరో బాధ్యత కూడా వచ్చి పడింది. రెండిటిలో దేనినీ వదిలేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల మీదుగా సాగుతున్న ఈ యాత్ర, తెలంగాణ గుండా కూడా సాగుతుంది.
కాంగ్రెస్ వర్గాల ప్రకారం, భారత్ జోడో యాత్ర తెలంగాణలో అక్టోబర్ 23న అడుగుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలన్నీ చుట్టాలి కాబట్టి ఈ యాత్ర తెలంగాణలో రెండు వారాల పాటు సాగే అవకాశం ఉంది. భారత్ జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక రెండూ ఒకే సమయంలో వస్తాయి. తెలంగాణ కాంగ్రెస్ కి ఇది పెద్ద సమస్యే. ఉప ఎన్నికకి ఎక్కువ సమయం కేటాయించాలా లేక భారత్ జోడో యాత్రకి ఎక్కువ సమయం కేటాయించాలా అనేది ఇక్కడ ప్రధాన సమస్య.
మిగతా నేతలతో పోలిస్తే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇది పెద్ద పరీక్ష. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, రేవంత్ రాహుల్ గాంధీతో కలిసి నడవాల్సిన పరిస్థితి. తను యాత్రలో బిజీగా ఉంటే, మరి మునుగోడు ఉప ఎన్నిక పరిస్థితి. ఇదే కాంగ్రెస్ వర్గాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మరోపక్క రేవంత్ పదవి చేపట్టాక, కాంగ్రెస్ పార్టీలోని పెద్దలంతా సుముఖంగా లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు.
Munugodu:
ఇలాంటి పరిస్థితులలో, రేవంత్ రెండు బాధ్యతలను సమర్ధవంతంగా ఎలా నిర్వర్తిస్తారు అనేది చూడాలి. లోగడ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు, పార్టీలో సీనియర్ నాయకులు ఆయనికి అంతగా సహకారం అందించలేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగే అవకాశం లేకపోలేదు. సాక్షాత్తూ రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తుండడంతో, పార్టీ నాయకులు భారత్ జోడో యాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ దృష్టిలో పడొచ్చు కాబట్టి. జరుగుతున్న ప్రమాణాల ప్రకారం, రేవంత్ రెడ్డికి వచ్చేది కష్టకాలమనే చెప్పాలి.