Munugode Politics : బీజేపీ ఆశలు, అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి, నల్లగొండ జిల్లాలో తమ జెండాను రెపరెపలాడించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి రాచబాట వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. నిజానికి ఈ స్థానంలో గెలుపు అవకాశాలు బీజేపీకే ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే.. ఎక్కడా చిన్న అవకాశం కూడా వదులుకోకుండా.. ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని.. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టాలని బీజేపీ అంచనా.
ఈ క్రమంలోనే ఈ నెల 21న మునుగోడులో పెద్ద ఎత్తున అమిత్‌షా సభను బీజేపీ నిర్వహించనుంది. ఆ సభలోనే రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ లోగా వీలైనంత మందిని తమ పార్టీలోకి తీసుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ నిన్న పలువురు కీలక టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీసుకున్న అనుచిత నిర్ణయాల వల్ల.. రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందనే ఆరోపణలు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. తద్వారా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. అంతేగాకుండా రాజగోపాల్‌రెడ్డితోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీలో చేరుతున్నారు.
Munugode Politics : టీఆర్‌ఎసే మెయిన్ టార్గెట్
మరోవైపు బీజేపీ టీఆర్‌ఎస్‌ను సైతం లక్ష్యంగా చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల పర్యటనలన్నీ టీఆర్‌ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జనంలోకి వెళుతున్నవే కావడం గమనార్హం. కుటుంబ పాలన అనే నినాదాన్ని ప్రజల నరనరాల్లోకి ఎక్కించేందుకు బీజేపీ యత్నిస్తోంది. 21న అమిత్‌షా సభలోనూ టీఆర్‌ఎసే మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. ఈ సమావేశం కోసం పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని బీజేపీ యత్నిస్తోంది. మొత్తానికి ఈ సమావేశం ఉప ఎన్నికకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చూడాలని నేతలు భావిస్తున్నారు.