Munugode bypoll : దేశ భవిష్యత్ గ్రామాల్లో ఉందన్నాడు నాడు మహాత్ముడు. కానీ నేడు అది ఏమాత్రం సెట్ కాదు. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. ఎందుకంటే మునుగోడు భవితవ్యం ఏంటి? అక్కడ ఎవరు గెలుస్తారు? అన్నది ఏదీ కూడా అక్కడ లేదు. మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థుల భవితవ్యం గ్రేటర్ హైదరాబాద్ చేతిలో నిక్షిప్తమై ఉంది. ఎందుకంటే మునుగోడు నియోజవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గ్రేటర్ హైదరాబాద్‌లో నివసిస్తుండడమే ఇందుకు కారణం. వీరే మునుగోడు ఓటింగ్‌ను ప్రభావితం చేయనున్నారు.
అసలు విషయాన్ని అధికార పార్టీ మాత్రమే గుర్తించింది. నియోజకవర్గానికి చెందిన 25 వేల మందికి పైగా ఓటర్లు చదవు కోసమో.. ఉద్యోగం.. లేదంటే వ్యాపార నిమిత్తం.. అదీ కాదంటే తమ పిల్లల చదువుల నిమిత్తం కుటుంబాలకు కుటుంబాలే హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే నివాసముంటున్నాయి. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు కొందరు ముఖ్యంగా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. స్కెచ్ గీసింది. హైదరాబాద్ అంతా గాలించైనా సరే వారిని పట్టుకుని తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది.
ఇప్పటికే మునుగోడు బాధ్యతను కేటీఆర్, హరీష్‌రావు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేటీఆర్ హైదరాబాద్‌లోని మునుగోడు ఓటర్ల బాధ్యతను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. మునుగోడు ఓటర్లలో 10-15 శాతం ఓట్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అత్యధికులు ఉప్పల్ నుంచి పెద్ద అంబర్‌పేట్ వరకూ ఉన్న ప్రాంతాల్లోనూ నివాసముంటున్నారని తెలుస్తోంది. ఈ ఏరియాల బాధ్యతలను టీఆర్ఎస్ స్థానిక నేతలకు అప్పగించినట్టు సమాచారం. వారి పని ఓటర్లను పట్టుకోవడం.. తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించడం. దీనికి ముందు గ్రామాలను పూర్తిగా జల్లెడ పడుతున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లిన వారి వివరాలు, అడ్రస్‌లతో సహా సేకరిస్తున్నారు. ఆ తర్వాత విడతల వారీగా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోటళ్లలో సమావేశాలు, విందులు ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.