Munugode : ఎట్టకేలకు మునుగోడులో సస్పెన్స్ వీడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపై ఎడతెగని నిరీక్షణ కొనసాగింది. ఒకవైపు బీజేపీ ఎప్పటి నుంచో ప్రచారం మొదలు పెట్టి దూసుకుపోతుంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు మాత్రం అభ్యర్థి ప్రకటించడంలోనే సమయాన్ని వెచ్చిస్తూ వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు అలకల బాధ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థిని ప్రకటించేందుకు వెనకాముందాడాయి. ఇప్పటికీ టీఆర్ఎస్ అయితే అభ్యర్థిని ప్రకటించనే లేదు. ఇక నేడు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్ అయ్యింది. పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అభ్యర్థినిగా నిర్ణయిస్తూ అధిష్టానం లేఖను విడుదల చేసింది.
ఈ అభ్యర్థి ఎంపికకు ముందు పెద్ద సీనే జరిగింది. ఇద్దరు అభ్యర్థులను ఫైనల్ లిస్ట్‌కి రాష్ట్ర నేతలు తీసుకున్నారు. ఇక వీరిద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేస్తారన్న దానిపై చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తర్జన భర్జనలు పడ్డారు. అనంతరం కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పాల్వాయి స్రవంతి పేరును ఫిక్స్ చేసి అధిష్ఠానానికి పంపించారు. అధిష్టానం కూడా చాలా రోజుల పాటు సమయం తీసుకుని చివరకు పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
Munugode : కాంగ్రెస్ కంచుకోట బద్దలు కాబోతోందా?
మొత్తానికి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఖరారై పోయింది. మరి ఇప్పటికైనా పార్టీ నేతలు జనాల్లోకి వెళతారా? లేదా? అనేది సందేహంగా మారింది. నిజానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి కంచుకోట ఇప్పుడు బద్దలు కాబోతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలు వీలైనంత త్వరగా మేల్కొని వెళ్లి అక్కడ పరిస్థితులను చక్కబెట్టాలి కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ముందుగా మునుగోడుకు వెళ్లి పాల్వాయి స్రవంతితో కలిసి ప్రచారం నిర్వహిస్తే అక్కడి స్థానం కాంగ్రెస్ పార్టీ చేజారకుండా చూసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.