Munugode : ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. ఆ తరుణం రానే వచ్చింది. నేడు మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మునుగోడు ఉప ఎన్నికకు కరెక్ట్‌గా నెల మాత్రమే గడువు ఉంది. వచ్చే నెల ఇదే రోజున మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్.. అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది.
మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం సెంట్రల్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్‌లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. కొద్ది రోజులుగా బీజేపీలో ఉపఎన్నికకు సంబంధించి గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఉప ఎన్నిక ఉండొచ్చనే సంకేతాలు పార్టీ నుంచి వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కీలక నేతలకు దిశా నిర్దేశం చేస్తోంది.
ఇక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ తిరుగుతూ.. ప్రతి ఇంటి గడపనూ టచ్ చేసేలా పార్టీ కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. నకిలీ ఓట్లపై కమలం పార్టీ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఓటర్ లిస్ట్‌ను క్షుణ్ణంగా ఆ పార్టీ నేతలు తనిఖీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. టీపీసీసీ చీఫ్ ఎప్పటికప్పుడు నేతలకు టచ్‌లో ఉంటూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం మంచి ప్లాన్స్‌తో ముందుకు వెళుతోంది. ఇప్పటికే వామపక్షాలను తమ వైపు తిప్పుకుంది. స్థానిక అధికారులందరినీ బదిలీ చేసి.. వారి స్థానంలో వేరొక అధికారులను నియమించింది. మొత్తానికి ఈ ముక్కోణపు పోరులో ఏ పార్టీ గెలుస్తుందో వచ్చే నెల 6న తెలియనుంది.