Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ ఓటర్లకు తాయిలాలు అందుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఏ నాయకుడు, కార్యకర్తలు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో కూడా తెలియకుండా ఉంది.ఇక్కడ తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కాపాడుకోవడం కూడా పార్టీలకు అతి పెద్ద టాస్క్‌గా మారింది. తాజాగా అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒకరు.. నామినేషన్ సమయంలో పార్టీ అభ్యర్థితోనే ఉన్నారు. నామినేషన్ పూర్తయ్యాక ఢిల్లీ వెళ్లి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
టీఆర్‌ఎస్ సీనియర్ నేత,భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరిక ఖాయమై పోయినట్టు కనిపిస్తోంది.నిజానికి ఆయన కూడా మునుగోడు టికెట్‌ను ఆశించిన వారిలో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం మాజీ ఎమ్మెల్యకు టికెట్ ఇచ్చింది. ఆ తరువాత కూడా పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఆయనను దూరంగా ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి జగదీష్‌రెడ్డితో విభేదాలున్నాయని.. ఈ కారణంగానే బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నట్టు సమాచారం.నేడో రేపో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బూర నర్సయ్య గౌడ్ కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన డాక్టర్స్ జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరించారు. అనంతరం ఎంపీగా కూడా విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు.మునుగోడులో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి టికెట్ తనకే దక్కుతుందని నర్సయ్య గౌడ్ నమ్మకంతో ఉన్నారు.కానీ ఆయనకు చుక్కెదురైంది.మిగిలిన రెండు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే ఎంచుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ సైతం రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ కారణాలన్నింటితో మనస్తాపం చెందిన బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం.