mundan Ceremony: పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఇంటిదేవుడికి ఇవ్వడం హిందూ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. పుట్టిన పిల్లలకు ఏడాది గడిచేలోపు పుట్టు వెంట్రుకలు సమర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎందుకు ఇలా చేస్తారనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. ఎందుకు తలనీలాలు సమర్పిస్తారు? దాని వల్ల ప్రయోజనాలేంటో చాలా మందికి తెలియదు.
మానవ శరీరంలోని శిరోజాలు అనేక పాపాలకు నిలయం అని పెద్దలు చెబుతుంటారు. వాటిని తొలగించడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతుంటారు. శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, శిశువు తనతోపాటు పూర్వజన్మ వాసనలను వెంట్రుకల రూపంలో తీసుకు వస్తాడని పెద్దలు చెబుతారు. అనేక విషయ వాంఛలను మోసుకొని వస్తారట.
ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే కేశఖండన జరగడం ఆనవాయితీ. కొందరు తొమ్మిది నెలలు పడగానే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీపిస్తుంటారు. మరికొందరు 11 నెలలప్పుడు కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. శిశువుకు తొలిసారి వెంట్రుకలు తీయించడం వల్ల గత జన్మ పాప ప్రక్షాళనతో పాటు మంచి జ్ఞానార్జనకు ఉపయోగకరంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా పుట్టు వెంట్రుకలు సంవత్సరంలోపు లేదా మూడో ఏట లేదా ఐదేళ్లప్పుడు తీయిస్తుంటారు.
mundan Ceremony: ఈ సమయాల్లోనే తీయించాలి..
సాధారణంగా ఉత్తరాయన పుణ్యకాలంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మంచిదని పండితులు చెబుతారు. మగ పిల్లలకు సరిమాసంలో, ఆడ పిల్లలకు బేసి మాసంలో కేశఖండన చేయించాలని సూచిస్తున్నారు పెద్దలు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు కేశఖండన జరిపించడానికి అనుకూలమైన వారాలుగా చెబుతారు. ఈ వారాలలో మధ్యాహ్నం 12 గంటల్లోపు పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమం పూర్తి చేసుకోవాలట. గురు, శుక్ర మౌఢ్యాల్లో ఈ పని చేయరాదని స్పష్టం చేస్తున్నారు. అలాగే శిశువు తల్లి గర్భిణిగా ఉండి 5 నెలలు దాటినా పుట్టు వెంట్రుకలు తీయరాదని సూచిస్తున్నారు.