Miyapur : ప్రేమించిన అమ్మాయి ఎక్కడ దక్కకుండా పోతుందోనన్న క్షణికావేషంలో వివేకం కోల్పోయి కొంతమంది అబ్బాయిలు ప్రేమోన్మాదులుగా మారుతున్న సంఘటనలు ప్రస్తుతం రోజు రోజుకు కలవరానికి గురిచేస్తున్నాయి. నిన్నటికి నిన్న తాను ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుందని నవీన్ అనే యువకుడు ఏకంగా వంద మంది కుర్రాళ్ళను వెంటబెట్టుకుని మరీ ప్రేయసి కుటుంబంపై దాడి చేసి అమ్మాయిని ఎత్తుకెళ్లి నానా రచ్చ చేసి రోడ్డుకెక్కాడు…తాజాగా ఓ ప్రభుద్దుడు ప్రేమోన్మాదిగా మారి ప్రేయసిపై కత్తితో దాడి చేసి కలకలం రేపాడు.

ఇక అసలు విషయానికి వస్తే మియాపూర్ లోని అదిత్యనగర్‌లో నివాసముంటున్న వైభవి అనే 19 ఏళ్ల యువతి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన 22 ఏళ్ల సందీప్ కుమార్ లు గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే మనస్పర్థలు ఏర్పడటంతో రెండేళ‌్లుగా సందీప్‌ను వైభవి దూరం పెడుతూ వస్తోంది. వైభవి స్వస్థలం కూడా రేపల్లె కావడంతో తల్లి అక్కడే ఉంటోంది. ఈమధ్యనే తన సొంతూరుకు వెళ్లిన వైభవి తల్లి శోభ సోదరుడితో కలిసి మియాపూర్‌కు మకాం మార్చింది. అంత వరకు బాగానే ఉన్నా. ప్రేమించిన అబ్బాయిన కాదని యువతి మరో పెళ్లికి సిద్ధం అవడం, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారన్న విషయం తెలుసుకున్న సందీప్ వైభవిపై కక్షపెంచుకున్నాడు. తనను దూరం పెడుతోందన్న కసితో ఆమెపై దాడికి ప్రయత్నించాడు. వైభవి ఇంటికి వెళ్లి అక్కడ కత్తితో హల్ చల్ చేశాడు సందీప్. అనంతరం తల్లీ కూతుర్లపై కత్తితో దాడి చేశాడు. తనను తాను కత్తితో గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని హాస్పిటల్ కు తరలించారు.
ప్రస్తుతం తల్లి శోభ, కూతురు వైభవిలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. సందీప్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని సీఐ తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం సందీప్ ను కోఠి హాస్పిటల్ కు తరలించారు. గొంతు దగ్గర బలంగా కత్తితో పొడుచుకోవడంతో సందీప్‌కు ఆపరేషన్ చేశారు వైద్యులు. ప్రస్తుతం అతడిని అబ్సర్వేషన్‌లో ఉంచారు. సందీప్ పైన కేసు నమోదు చేశామని అతడి ఆరోగ్యం మెరుగవగానే దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.