Miss Universe : అగ్రరాజ్యం అమెరికా కు చెందిన ఆర్ బానీ నోలా గాబ్రియల్ విశ్వసుందరి 2022 కిరీటాన్ని గెలుచుకుంది. తాజాగా న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన 71వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఈ భామ తన టాలెంట్‌తో అందాల రాణిగా నిలిచింది. మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఈ అందాల సుందరికి కిరీటాన్ని అలంకరించి ఆమెను విశ్వసుందరిగా ప్రకటించింది. మిస్ యూనివర్స్‌గా నిలిచిన ఆర్ బానీ నోలా గాబ్రియల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కాంపిటీషన్ కు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

బానీ నోలా గాబ్రియల్ మొదటిసారి మిస్ టెక్సాస్ USAను గెలుచుకున్న మొదటి ఫిలిపినా-అమెరికన్‌గా డిసెంబర్ 2021లో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మిస్ యూనివర్స్ 2022 గా కిరీటాన్ని కైవసం చేసుకుని తన సంతోషాన్ని రెట్టింపు చేసుకుంది. ఆర్ బొన్నీ డీప్ నెక్‌లైన్ , లోతైన నడుము ప్యాడెడ్ షోల్డర్స్ తో వచ్చిన భారీ అలంకరణలు కలిగిన ఫిగర్-హగ్గింగ్ గౌన్‌ను ఫైనల్స్ కు వేసుకుని, ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా డైమండ్ చెవిపోగులు పెట్టుకుని మెరిసిపోయింది.

విశ్వసుందరిగా గెలుపొందిన ఆర్ బానీ నోలా గాబ్రియల్‌కు లభించే సౌకర్యాలు మామూలుగా ఉండవు. మిస్ యూనివర్స్ సంస్థ ఈ బ్యూటీకి అందించే ఫెసిలిటీస్ గురించి తెలుసుకుంటే సామాన్యులు అవాక్కవ్వాల్సిందే. ముందుగా పేజెంట్ ను గెలుచుకున్నందుకు గాను విశ్వసుందరికి రూ.2 కోట్ల నగదు బహుమతిని అందిస్తుంది మిస్ యూనివర్స్ సంస్థ. అంతే కాదు ప్రత్యేక వసతి సౌకర్యాన్ని అందిస్తుంది. అది కూడా పూర్తి ఉచితంగా. న్యూయార్క్ సిటీలో ఉన్న మిస్ యూనివర్స్ సంస్థ అపార్ట్‌మెంట్‌లో లగ్జరీగా ఏడాది పాటు విశ్వసుందరి ఉచితంగా ఉండే వెసులుబాటు కల్పిస్తుంది. వంటింట్లో వాడే వస్తువుల నుంచి వేసుకున్న బట్టల వరకూ అన్నీ ఉచితమే.

ఒకవేళ ఈ విశ్వసుందరి విహారయాత్రకు వెళ్లాలనుకున్నా అందుకు తగ్గ విమాన ఖర్చులను మిస్ యూనివర్స్ సంస్థనే భరిస్తుందట. విమాన టిక్కెట్ల నుంచి హోటల్స్, రెస్టారెంట్‌లకు అయ్యే ఖర్చులను సంస్థ భరిస్తుందట. ఏడాది పాటు ఈ సంస్థ నిర్వహించే సామాజిక కార్యక్రమాలు, పార్టీలకు ఈ విశ్వసుందరి హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక సంస్థకు బ్రాండ్ అబాజిడర్‌గాను ఈ విశ్వసుందిరి కొనసాగుతుంది.

తమ అందాన్ని కాపాడుకునేందుకు గాను ప్రత్యేకంగా ఓ మేకప్ ఆర్టిస్ట్ ను, స్టైలిస్ట్‌ను, న్యూట్రిషనిస్టు, డెంటిస్ట్‌లను ఈమె కోసం నియమిస్తుంది సంస్థ. ఈవెంట్లకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు అమ్మడుకు అవసరమయ్యే కాస్ట్యూమ్స్ దగ్గరి నుంచి మేకప్, ఆర్నమెంట్స్ వరకు సంస్థనే ఏర్పాటు చేస్తుంది. ఈ సుందరి ఫోటో షూట్ కోసం ప్రత్యేకంగా ఓ ఫోటోగ్రాఫర్ ను కూడా నియమిస్తుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందిన ఆర్ బానీ నోలా గాబ్రియల్ కు ఈ సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.