Minister Rojaఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న మంత్రి రోజా గతంలో సినిమా రంగంలో తనదైన శైలిలో రాణించారు. ఆమె రాజకీయాల్లోకి వెళ్లినా సినిమా రంగంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా ఓ సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివారం నాడు శాసనసభ అనే సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటు విలువ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సమాజంలో ఓటు ఎందుకు వేయాలో అందరికీ వివరించడం ఆకట్టుకుంది.
శాసనసభ మూవీ ట్రైలర్‌లో తనకు రెండు డైలాగ్స్ బాగా నచ్చాయని మంత్రి రోజా చెప్పారు. ఈ డైలాగుల గురించి ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. కులం చూసి ఓటు వేసే రోజులు పోవాలని.. మా వాడు, మా కులం అని చెప్పి ఓటు వేసి.. తర్వాత వాడు ఏం చేయలేదని బాధపడేకంటే మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ప్రజలు కులం, మతం, ప్రాంతం అనేది పక్కన పెట్టాలని హితవు పలికారు.
ప్రజలు వారి ప్రాంతంలో ఎవరు నిలబడ్డారు.. వారిలో ఎవరు బెస్ట్.. ఎవరికి ఓటేస్తే మంచి చేస్తారు అనే ఆలోచన చేయాలని మంత్రి రోజా అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవడం సమాజ శ్రేయస్సుకు ఎంతో ముఖ్యమని రోజా తెలిపారు. శాసనసభ సినిమాలో ‘ఓటేసే రోజు మాత్రమే ఓటరు రాజురా.. ఆ తర్వాత 5 ఇయర్స్ మనమే రాజురా’ అనే డైలాగ్ ఉందన్నారు.
రోజులు మారాయంటున్న మంత్రి రోజా
ఓటు వేసే రోజు మాత్రమే ఓటరును రాజుగా చూసే రోజులు పోయాయని మంత్రి రోజా అన్నారు. ఓటేసిన రోజు నుంచి మళ్లీ ఓటు వేసే రోజు వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు గడపగడపకు వెళ్లి.. మీకు ఏం ఇచ్చారు.. ప్రభుత్వం ఇచ్చినవన్నీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడమే కాకుండా.. ఆ ప్రాంత అభివృద్ధికి కూడా ప్రతి రోజు తిరుగుతున్నారని గుర్తుచేశారు. ఇంతకు ముందులా పరిస్థితులు లేవని ప్రజలు అర్థం చేసుకోవాలని.. ఈ విషయంలో కచ్చితంగా మార్పు వచ్చిందని తెలిపారు. దానికి తగ్గట్టే పొలిటికల్ లీడర్స్ కూడా మారాల్సిన అవసరం ఉందని రోజా పేర్కొన్నారు.