ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల జాబితాలో టాలీవుడ్ స్టార్స్ మొదటి స్థానంలో ఉంటారని చెప్పాలి. బాలీవుడ్ హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ మన తెలుగు హీరోలు తీసుకుంటున్నారు. ప్రభాస్ ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలో తీసుకుంటున్నారు. అలాగే బన్నీ కూడా పుష్ప 2 కోసం అంతే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఅర్ లాంటి స్టార్స్ 50 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ 60 నుంది 80 కోట్ల మధ్య చార్జ్ చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ వాళ్ళకి రెమ్యునరేషన్ గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
అయినా కూడా నిర్మాతలు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి కారణం వారికున్న మార్కెట్ రేంజ్ అని చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే సినిమాకి పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనే నమ్మకంతోనే నిర్మాతలు ధైర్యం చేసి వంద కోట్లకి పైగా బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. తమ మార్కెట్ స్టామినాని ఇండియన్ వైడ్ కి విస్తరించుకున్నారు. ఈ నేపధ్యంలోనే వారి రెమ్యునరేషన్ డిమాండ్ కూడా పెరిగిందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వాల్తేర్ వీరయ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి ఈ రెమ్యునరేషన్ గురించి ప్రశ్న ఎదురైంది.
హీరోలు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, ఈ కారణంగా సినిమా బడ్జెట్ లు కూడా పెరిగిపోతున్నాయని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి వేసిన ప్రశ్నకి మెగాస్టార్ చిరంజీవి సమాధానం చెప్పారు. హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి అని ప్రశ్నించారు. హీరో వలన ఆ సినిమా బిజినెస్ మొత్తం జరుగుతుంది. అలాగే ఒక్క సారి ఒక హీరో సినిమా ఒప్పుకున్నారు అంటే ఆ కథలో పాత్రకి తగ్గట్లుగా తనని తాను మార్చుకోవడంతో పాటు. అందరికంటే ఎక్కువ ఎఫెర్ట్ పెట్టి సినిమాని తన భుజాలపై వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. ప్రతి ఫ్రేమ్ లో హీరోల కష్టం కనిపిస్తుంది. హీరోల మార్కెట్ రేంజ్ బట్టి సినిమాకి బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి టైంలో హీరోలు వారి మార్కెట్ రేంజ్ కి తగ్గట్లుగా రెమ్యునరేషన్ తీసుకోవడంలో అస్సలు తప్పేలేదు అని చిరంజీవి తేల్చేశారు.