Megastar-Puri: గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ మీట్‌లో పూరి జగన్నాథ్ కనిపించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. చిరు పిలిచినా కూడా పూరి రాలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకో.. మరెందుకో గానీ పూరితో చిరు లైవ్‌లో మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే..ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ.. సక్సెస్ ఎనర్జీని గెయిన్ చేస్తుందని ఫెయిల్యూర్ ఎనర్జీని లాగేస్తుందని చెప్పారు. సక్సెస్ ఉంటే జీనియస్.. లేదంటే ఫూల్‌లా కనిపిస్తమని తెలిపారు.
దెబ్బకు హీలింగ్ టైమ్ కావాలని.. అయితే అది చాలా తక్కువ టైమ్ ఉండాలని.. తానైతే ఆ హీలింగ్ టైమ్‌ని ఒక నెల మాత్రమే పెట్టుకుంటానని పూరి చెప్పుకొచ్చారు.ఆస్తులే పోనీ.. యుద్ధమే రానీ హిలింగ్ టైమ్ మాత్రం తక్కువ ఉండాలన్నారు. తన లైఫ్‌లో సంతోషంగా ఉన్న రోజులే ఎక్కువని పూరి చెప్పుకొచ్చారు.హీలింగ్ పిరియడ్ తగ్గించుకోవడాన్ని చిరు అభినందించారు. తనది 44 ఏళ్ల అనుభవమని.. ఆ అనుభవంతోనే చెబుతున్నానంటూ మెగాస్టార్.. పూరికి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. హిట్‌తో ఎనర్జీ సహజమని.. ముందు వర్క్‌ని ఎంజాయ్ చేయాలని సూచించారు. తాను గాడ్ ఫాదర్ షూటింగ్‌లో కూడా సత్యదేవ్, మోహన్‌రాజాకి ఇదే విషయం చెప్పానన్నారు.
ఫెయిల్యూర్ వచ్చింది కదాని డంగ్ అయిపోవద్దని.. ఛాలెంజ్‌గా తీసుకుని ఎక్కడ తప్పు జరిగింది? ఏం చేయాలి? ఏం చేయకూడదనేవన్నీ బేరీజు వేసుకుని ముందుకు సాగాలని పూరికి చిరు సూచించారు. స్ప్రింగ్‌ని అణచిపెట్టి వదిలితే ఎలా ఎగురుతుందో అలా చేయగలరంటూ పూరికి బూస్ట్ ఇచ్చారు. అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో పాటు.. క్రాఫ్ట్ నుంచి అన్ని పనులు తెలుసని.. అలాంటి మీరు వాతావరణం అనుకూలిస్తే.. అన్ని పనులు చేయగలరన్నారు. తనకు ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడుతూ కూర్చోకుండా నెల రోజుల పాటు హాయిగా టూర్ వేసి వచ్చానని చిరు తెలిపారు. ఆ తర్వాత కసిగా పనిచేసి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నానన్నారు. కాబట్టి రెస్ట్ తీసుకోవాలి కానీ రిలాక్స్ అవ్వొద్దని సూచించారు. మీసం మెలేసి రంగంలోకి దిగిపోవాలని పూరికి మెగాస్టార్ తెలిపారు.