Megastar Chiranjeevi : స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు ఎన్ని వచ్చినా.. సరైన కంటెంట్‌తో సినిమాలు ఇవ్వగలిగితే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించారు. అందుకు నిదర్శనం ‘బింబిసార’, ‘సీతా రామం’, ‘కార్తికేయ 2’ చిత్రాలే. మంచి కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాలు ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు.
సినిమా పరిశ్రమలోనే తాను పెరిగానని.. మధ్యలో వేరే రంగానికి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చానన్నారు. తిరిగి వచ్చిన తర్వాత తనకు ఈ పరిశ్రమ విలువ మరింతగా తెలిసి వచ్చిందన్నారు. టాలెంట్ ఉండి.. కష్టపడే గుణం ఉంటే.. ప్రతి ఒక్కరినీ సినిమా ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంటుందన్నారు. అంత గొప్పది సినిమా ఇండస్ట్రీ అని పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో తాను భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ స్థాయి, స్థానం దక్కడం అనేది గొప్ప వరంగా భావిస్తున్నానన్నారు. ఒక ఫైర్‌తో టాలెంట్ వున్న వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ నిలదొక్కుకుంటారన్నారు. లైట్ తీసుకునే వారికి మాత్రం ఇక్కడ చోటుండదన్నారు.
Megastar Chiranjeevi : రెండు బ్రెయిన్‌లు ఎప్పుడూ మంచిదే
ఇక ఈ సందర్భంగా చిరు ఒక సీక్రెట్‌ని రివీల్ చేశారు. తన భార్యను ఏమని పిలుస్తారో.. ఏ పాటతో ఆట పట్టిస్తుటారో మెగాస్టార్ చెప్పేశారు. ‘‘జాతిరత్నాలు’ సినిమాతో అనుదీప్ పెద్ద రత్నంగా మారిపోయాడు ఆ సినిమాలో ‘చిట్టి’ పాటతో నాకు ఇంకా బాగా దగ్గరయ్యారు. ఎందుకంటే.. నా భార్యని చిట్టి అని పిలుస్తుంటా. అప్పుడప్పుడు ఆ పాటతో నా భార్యని ఆటపట్టిస్తుంటాను. ఇక ఈ సినిమాకి ఇద్దరు దర్శకులని తెలిసింది. దర్శకద్వయం అని అప్పట్లో కూడా ఉండేది. రెండు బ్రెయిన్‌లు ఎప్పుడూ మంచిదే. మ్యూజిక్ డైరెక్టర్ రథన్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో నన్ను ఫిదా చేశారు. ఆ తర్వాత ‘జాతిరత్నాలు’. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.