దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో బెస్ట్ క్లాసిక్ మూవీస్ సరసన ఈ సినిమా కూడా చేరడం విశేషం. ఇండియన్ వైడ్ గా ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలలో సీతారామంకి ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. అలాగే ఏకంగా 75 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఈ సినిమాపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు.
ట్విట్టర్ లో సినిమాని ప్రశంసిస్తూ లెటర్ రిలీజ్ చేశాడు. సీతా రామం సినిమాని చూసాను ఒక చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా భిన్నమైన కథనం తో ఈ ప్రేమకథని అద్భుతంగా ఆవిష్కరించారు. మనసులలో చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్, స్వప్నా దంత, ప్రియాంకా దంత లకి శుభాకాంక్షలు అందించారు. అలాగే సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచిపోయే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్, ముఖ్యంగా సీతా, రామ్ లుగా ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కి శుభాకాంక్షలు చెప్పారు.
అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన రష్మిక మందన్నకి అభినందనలు తెలిపారు. ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిత్రం జాతీయ అవార్డులని గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక చిరంజీవి అభినందనలపై చిత్ర నిర్మాతలు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ప్రస్తుతం సరైన హిట్స్ లేకపోవడంతో ఇప్పటికి థియేటర్స్ లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సినిమాకి లభిస్తుంది. అలాగే సెప్టెంబర్ 9న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.