గాడ్ ఫాదర్ సినిమా సూపర్ సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ మీద ఉన్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొంత ఆందోళన చెందిన గాడ్ ఫాదర్ సినిమా పూర్తిగా తాను కోరుకున్న విధంగా రావడంతో కచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ మొదటి నుంచి చిరంజీవిలో కనిపించింది. ఆ నమ్మకానికి తగ్గట్లుగానే సినిమాకి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా మొదటి సారి పూరి జగన్నాథ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా విశేషాలపై చర్చించారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి లైగర్ సినిమా గురించి పూరి జగన్నాథ్ ని అడిగారు. ఆ సినిమా ఫ్లాప్ తర్వాత మళ్ళీ కొత్త కథ రాసుకోవడానికి వెళ్లిపోయానని పూరి చెప్పాడు. అలాగే ఇంటర్వ్యూ చివర్లో తన ఆటోజానీ కథని చింపేసావా, ఇంకా ఏమైనా ఉందా అని చిరంజీవి పూరిని అడిగారు. ఆ కథ అవుట్ డేటెడ్ అయిపోయిందని, దానిని వదిలేసా అని చెప్పారు. ఇప్పుడు మరింత కొత్త కథని మీ కోసం సిద్ధం చేస్తున్నా అని పూరి జగన్నాథ్ చెప్పాడు.
నీతో సినిమా చేయడం కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చిరంజీవి పూరి జగన్నాథ్ కి ఆఫర్ ఇవ్వడం కొసమెరుపు. దీనికి పూరి కూడా మెగాస్టార్ కి ధన్యవాదాలు చెప్పడం విశేషం. ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా లైగర్ ఫ్లాప్ తో సంబంధం లేకుండానే పూరి జగన్నాథ్ టాలెంట్ పై చిరంజీవి చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే అతనితో సినిమా చేయడానికి ఆఫర్ ఇచ్చారనే మాట వినిపిస్తుంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఆఫర్ ని ఉపయోగించుకొని పూరి జగన్నాథ్ అతనికోసం మంచి కథని సిద్ధం చేస్తారా అనేది చూడాలి.