ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ముగిసింది. గురువారం మధ్యాహం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి.. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన లంచ్ మీటింగ్ తో సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యలు , ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. గంటా 15 నిముషాల పాటు సాగిన సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చ్చించారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి కలుస్తున్నానని చిరంజీవి జగన్ తో అన్నారు. సీఎం జగన్ తో సమావేసం చాలా సంతృప్తిగా జరిగిందని చిరంజీవి అన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మద్య తర్జనభర్జనలు నెలకొన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరు తెలిపారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని.. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్ కు వివరించినట్లు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ బయటకు కనిపించేంత గ్లామర్ లేదని.. ఇండస్ట్రీలోని కార్మికులకు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి ఉందని చిరంజీవి అన్నారు. అలాంటి పేద కార్మికులను ఆదుకోవల్సిన బాధ్యత ఉందని తెలిపారు. థియేటర్ల యాజమాన్యాలకు కూడా ధైర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు చిరంజీవి. ఈ సమస్యలపై తాను చేసిన నిర్మాణాత్మక సూచనలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు మెగాస్టార్ తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని.. ఎవరూ భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై వస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని జీవోలో మార్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు సినిమా రంగంలోకి వ్యక్తులు సంయమనం పాటించాలని.. కంగారుపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. చిన్నసినిమాలకు సంబంధించి ఐదో షో ఉండాలన్న విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించారని చిరు తెలిపారు. సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందునే ఒక్కడినే వచ్చాచని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ వివదానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు తగ్గిస్తారా పెంచుతారా అనేదానిపై స్పష్టంగా చెప్పలేనని.. కానీ అందరికీ న్యాయం జరుగుతుందని చిరు అన్నారు. అన్నివర్గాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చిరంజీవి వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జారీ చేసిన జీవో నెం.35 తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య వార్ మొదలైంది. టికెట్ రేట్ల అంశం హీరోల రెమ్యునరేషన్ వరకు వెళ్లింది. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే టికెట్ల ధరలపై వివాదం అవసరం లేదని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు.
ALSO READ: Bangarraju (2022) – Movie (బంగార్రాజు సినిమా ఫస్ట్ రివ్యూ)