ఆదిపురుష్ సినిమా టీజర్ ఏ స్థాయిలో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి చేరువ అయ్యిందో అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ముందుగా ఆదిపురుష్ టీజర్ గ్రాఫిక్స్ వర్క్ బాగోలేదని విమర్శలు వచ్చాయి. వీటిపై విపరీతంగా ట్రోల్స్ కూడా నడిచాయి. అయితే ఈ టీజర్ ని సిల్వర్ స్క్రీన్ కోసం త్రీడీ వెర్షన్ లో డిజైన్ చేయడం జరిగిందని మొబైల్ స్క్రీన్స్ లో నాసిరకంగానే కనిపిస్తుందని ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు. తరువాత బిగ్ స్క్రీన్ పై త్రీడీ ఆదిపురుష్ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. తరువాత ఆదిపురుష్ కథపై విమర్శలు వచ్చాయి. ఇందులో పాత్రల ఆహార్యం పూర్తిగా మార్చేశారని, అసలు హిందుత్వ విశ్వాసాలకి విరుద్ధంగా రావణుడు, హనుమంతుడు, ఆంజనేయుడి పాత్రలు ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి.
వీటిపై హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసి కేసులు కూడా పెట్టాయి. అయితే ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ చూసి అంచనాకి రావొద్దని, ఎవరి మనోభావాలు కించపరిచే విధంగా తన సినిమా ఉండదని ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్ తరాల వారికి శ్రీరాముడి గొప్పతనం చెప్పడానికే కొన్ని మార్పులు చేయడం జరిగిందని కూడా చెప్పారు. అయితే వీటిపై హిందుత్వ సంస్థలు ఎంత సంతృప్తి చెందుతాయో తెలియదు. ఇక తాజాగా మంచు విష్ణు ఆదిపురుష్ టీజర్ పై విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం తెరపైకి వచ్చింది.
హిందీ మీడియాతో మాట్లాడుతూ ఆదిపురుష్ తనని అసంతృప్తికి గురి చేసిందని, యానిమేషన్ అని ముందే చెబితే ట్రోల్స్ వచ్చేవి కావని అన్నట్లు ప్రచారం నడుస్తుంది. దీనిపై మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఎవరో తన జిన్నా సినిమా రిలీజ్ కి ముందే ఇలా తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. తాను ఆదిపురుష్ టీజర్ పై ఎలాంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రభాస్ కి తనకి మంచి అనుబంధం ఉందని కూడా గుర్తు చేశాడు.