Congress President : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గే విజయం సాధిస్తారని.. ఎన్నిక లాంఛనమే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ శశిథరూర్ పట్టు వీడక పోవడంతో ఎన్నిక అనివార్యమైంది. సోమవారం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96 శాతం పోలింగ్ నమోదైంది. ఖర్గేకు 7,897 ఓట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. మొత్తానికి 6,822 ఓట్ల భారీ మెజార్టీతో ఖర్గే గెలుపొందారు.
సుదీర్ఘ కాలం తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర వ్యక్తి ఎన్నికయ్యారు. మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శశిథరూర్ సైతం ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ సైతం ఖర్గేకే మద్దతు తెలిపింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 6వ సారి ఓటింగ్ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది.
సుమారు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు, అది కూడా గాంధీయేతర కుటుంబం నుంచి ఎన్నిక కావడం విశేషం. నిజమైన పార్టీ పునరుద్ధరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అవుతుందని తాను నమ్ముతున్నట్టు శశిథరూర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు అభినందనలు తెలిపారు. 80 ఏళ్ల వయసున్న మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఫలితాలకు ముందే అధ్యక్షుడిగా ఖర్గే పేరును వెల్లడించి రాహుల్ చిక్కుల్లో పడ్డారు.