సూపర్ స్టార్ మహేష్ బాబు టెలివిజన్ షోలలో కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. తన సినిమా ప్రమోషన్స్ సమయంలో తప్ప మిగిలిన సమయాలలో టీవీ ప్రేక్షకులకి అంతగా దొరకడు. చాలా మంది స్టార్స్ డాన్స్ రియాలిటీ షోలకి, అలాగే ఫెస్టివల్ రిలేటెడ్ ఈవెంట్స్ కి గెస్ట్ గా వస్తూ సందడి చేస్తారు. అయితే మహేష్ బాబు మాత్రం ఆహాలో ప్రసారం అయిన బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ కి తప్ప పెద్దగా టీవీ షోలలో కనిపించలేదు. అయితే మొదటిసారి సూపర్ స్టార్ మహేష్ జీ5 ఛానల్ నిర్వహిస్తున్న ఒక డాన్స్ రియాలిటీ షోకి గెస్ట్ గా రాబోతున్నారు. ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాకున్నా ఆ షూటింగ్స్ కి సంబంధించి కొన్ని విజువల్స్ బయటకి వచ్చాయి.
ఇక ఈ డాన్స్ షోలో సూపర్ స్టార్ కూతురు సితార డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఇక తన కూతురు డాన్స్ చూడటంతో పాటు, ఆమెని ఎంకరేజ్ చేయడానికి ఈవెంట్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని, అయితే జీ5 సర్ప్రైజ్ ఇవ్వడం కోసం సస్పెన్స్ మెయింటేన్ చేస్తుందని తెలుస్తుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ ఆ షోలో తన కూతురుతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నట్లు కొన్ని వీడియోలు బయటకి రావడంతో న్యూస్ కాస్తా వైరల్ గా మారింది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో ఒక హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారు అయిపొయింది. ఇక మరో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ భామని చూస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.