Mahendra Singh Dhoni: టీమిండియా జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ధోని సారథ్యంలోనే ఇండియా జట్టు 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక జట్టుపై విన్నింగ్ షాట్ కొట్టిన సందర్భాన్ని క్రికెట్ అభిమానులు ఇంకా మరచిపోలేదు. ఇదిలా ఉంటే మహేంద్ర సింగ్ ధోని తాజాగా సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాడు. సొంతంగా ‘ధోని ఎంటర్ టైన్మెంట్’ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ సంస్థను ప్రారంభించాడు.
ధోని ఎంటర్ టైన్మెంట్ సంస్థకు మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ నుంచి అందరూ బాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తారని అందరూ అనుకున్నారు. కానీ సౌత్ ఇండియా నుంచి తమిళ చిత్రాన్ని నిర్మిస్తారని ధోనీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. సంస్థలో నిర్మించనున్న మొదటి చిత్రానికి రమేష్ తమిళ్ మణి డైరెక్టర్ గా ఉంటారని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అంశాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని సంస్థ ప్రతినిధులు మీడియాకు వివరించారు.
ధోనీ ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. తమిళనాడులో ధోనీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నందుకే మొదటి చిత్రాన్ని తమిళంలో నిర్మించనున్నారని సమాచారం. తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి ధోనీ త్వరలోనే ఓ సినిమా చేయనున్నారని కొన్ని రోజుల నుండి ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనిపై కూడా ధోనీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్రతినిధులు స్పందించారు.
Mahendra Singh Dhoni:
ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వివిధ భాషలలో చిత్రాలు నిర్మిస్తామని తెలిపారు. కేవలం తమిళ భాషకే పరిమితం కాకుండా హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాలు నిర్మిస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే ధోనీపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా “ఎం. ఎస్. ధోనీ” అనే బయో పిక్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం కోట్ల వసూళ్లను రాబట్టింది. కొత్తగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాణ రంగంలో కూడా విజయవంతం కావాలని ధోని అభిమానులు కోరుకుంటున్నారు.