Piracy websites : బొమ్మ అలా పడిందో లేదో.. ఇలా కొన్ని వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చేస్తోంది. పిక్చర్ క్వాలిటీ విషయంలో కూడా పెద్దగా తేడా ఉండదు. అంత బాగా పైరసీ చేస్తారు. వీళ్ల టాలెంట్‌కి మెచ్చుకోవాలో.. లేదంటే.. సినీ ఇండస్ట్రీ కష్టానికి గండి కొడుతున్నందుకు నిందించాలో అర్ధం కాని పరిస్థితి. మొత్తానికి ఏ సినిమా అయిన సరే.. క్షణాల్లో పైరసీ వచ్చేస్తోంది. అయితే చట్ట విరుద్ధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్‌సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. అయినా సరే ప్రసారం చేస్తామంటూ చూస్తూ ఉపేక్షించబోమని కోర్టు హెచ్చరికలు జారీ చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల కానుంది. ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా.. ఇటీవలి కాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే వెనువెంటనే పైరసీ కాపీ వెబ్‌సైట్స్‌లో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు.
Piracy websites : చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం
పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. ఈ కేసు సోమవారం న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో విచారణకు వచ్చింది. ఎన్నో నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్‌సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనానికి వెల్లడించారు. దీంతో సినీ కార్మికుల జీవితాలు సైతం నాశనం అవుతున్నాయని తెలిపారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్‌సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తూ తీర్పును వెలువరించారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్‌సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.