ఏపీలో కుప్పం వేదికగా టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే గుంటూరు, కందుకూరు ఘటనల నేపధ్యంలో రోడ్ షోల మీద, ర్యాలీల మీద నిషేధం విధిస్తూ జీవో జారీచేశారు. అయితే ఈ జీవోపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునవ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన చేస్తున్న నేపధ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు పర్యటనకి తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైక్ లు కూడా బంద్ చేయించారు. అలాగే టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు.
ఇక చంద్రబాబు కుప్పంలోకి అడుగుపెట్టిన వెంటనే పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తిని, నా సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి మీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. టీడీపీకి వస్తున్న ప్రజా మద్దతు చూసి జగన్ రెడ్డి భయపడుతున్నాడు అని విమర్శించారు. అతి త్వరలో వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.
మీ అరాచకానికి ప్రజలని బలి చేస్తున్నారని అన్నారు. అలాగే తనను అడ్డుకుంటున్న నేపధ్యంలో పోలీసులు లెటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలపై జరిగిన లాఠీ చార్జ్ ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిరంకుశం ప్రభుత్వంకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఏ చట్టానికి లోబడి జీవో తీసుకొచ్చారని అన్నారు. బ్రిటిష్ రూలింగ్ ని ఇప్పుడు జగన్ రెడ్డి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారు.