KTR : మునుగోడు ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగానే ఉన్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఎవరి లెక్కలు వారివి. ఈ క్రమంలోనే మునుగోడులో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి ఇంటికి రెండు కేజీల చొప్పున తెల్లవారిపాటికే చికెన్ వచ్చి చేరుతోందని టాక్. ఇక డబ్బులు లెక్కలేకుండా పంచేస్తున్నారని సమాచారం. ఇక ఈ ఎన్నికలే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమదే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు.
తాజాగా కేటీఆర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గుజరాత్ బీజేపీకి అడ్డా అని.. అక్కడ 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని.. అలాంటి గుజరాత్‌కి మోదీ ఐదు నెలల్లో 16 సార్లు వెళ్లారన్నారు. కేంద్ర మంత్రులను మోహరిస్తున్నారన్నారు. అలాంటిది తాము వెళితే తప్పేంటన్నట్టుగా మాట్లాడారు. తమ పార్టీ గెలిస్తేనే తమకు మనుగడ ఉంటుందని.. కాబట్టి తాము ఎన్ని సార్లైనా వెళతామన్నారు. విపక్షాలు ఏమీ చేయకుండానే ఏదో చేసేసినట్టు ప్రచారం చేసుకుంటున్నాయని.. తాము చేసింది చెప్పుకోవడానికి గడప గడపకూ వెళుతున్నామన్నారు.
గతంలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌ల ఉప ఎన్నిక నేపథ్యం వేరని కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి.. మూడేళ్లుగా బీజేపీతో బేరసారాలు నడుతున్నారన్నారు. ఈ క్రమంలోనే మంచి బేరం కుదిరాక రాజీనామా చేశారని కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డికి ఒక చిన్న కంపెనీ ఉందని.. దానికి పెద్ద కాంట్రాక్టు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆ కాంట్రాక్టులో ఎవరి వాటా ఎంత అని కేటీఆర్ నిలదీశారు. దీని వెనుక ఉన్న గుజరాత్ రహస్యమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.