ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ కృతి శెట్టి. ఈ అమ్మడు కెరియర్ ఆరంభంలో ఏకంగా మూడు వరుస హిట్స్ తో మంచి జోరు మీద కనిపించింది. అయితే తరువాత వరుస మూడు ఫ్లాప్ లతో కాస్తా డీలా పడింది. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్యకి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళంలో కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరో సూర్యతో ఆడిపాడింది. ఇక ఇప్పుడు మలయాళంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది.
మలయాళంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ స్టార్ టోవినో థామస్ కి జోడీగా పాన్ ఇండియా మూవీలో నటించబోతుంది. భారీ బడ్జెట్ తో యూనివర్శల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇక తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మూడు యుగాల నేపధ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని తెలుస్తుంది. కేరళలోని యుద్ధకళ అయిన కలరి బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. సుజిత్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో టోవినో థామస్ మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు.
ఇక మిగిలిన పాత్రలకి జోడీగా ఐశ్వర్య లక్ష్మి, సురభి కనిపించబోతున్నారు. అయితే ముగ్గురులో కృతి శెట్టి పాత్ర ప్రాధాన్యత ఉన్నదని తెలుస్తుంది. ఇక మలయాళంలోకి అడుగుపెట్టడంపై కృతి శెట్టి కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. మరి అక్కడ పాన్ ఇండియా మూవీతో అయినా కృతి శెట్టి తన అదృష్టాన్ని మార్చుకుంటుంది ఏమో చూడాలి. ఇక తెలుగులో కూడా ఓ యంగ్ హీరో సినిమా కోసం కృతి శెట్టిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.