రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ వారసుడుగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగుపెట్టాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలతో ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చరిత్రలో ఇప్పటికి ఎవరికీ సాధ్యం కానీ రెండు వేల కోట్ల కలెక్షన్స్ రికార్డుని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఇండియాలో మొదటి పాన్ ఇండియా హీరోగా, మొట్ట మొదటి హైయెస్ట్ బడ్జెట్ హీరోగా కూడా ప్రభాస్ తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. ఇక ప్రభాస్ కెరియర్ లో ప్రతి అడుగులో వెనకుండి కృష్ణం రాజు నడిపించాడని చెప్పాలి. తమ్ముడు కొడుకు అయినా కూడా తన సొంత కొడుకులా ప్రభాస్ ఎదుగుదలని కృష్ణంరాజు కటాక్షించారు. అలాగే ఆ ఎదుగుదలని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు.
చాలా సందర్భాలలో ప్రభాస్ పై తనకున్న ప్రేమని కృష్ణంరాజు బహిరంగంగానే చూపించారు. తాను అందుకోలేని ఎత్తులకు తన కొడుకు ఎదగడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలా కృష్ణం రాజు నటవారసుడుగా పాన్ ఇండియా స్థాయిలోకి ఎదిగిన ప్రభాస్ తన పెదనాన్నతో కలిసి నటించిన సినిమాల విషయంలో ఆశించిన సక్సెస్ ని పొందలేకపోయారు. ఇద్దరు కలిసి మొదటిగా 2007లో బిల్లా మూవీలో నటించారు. ఈ మూవీ బాలీవుడ్ హిట్ మూవీ బిల్లాకి రీమేక్ గానే తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ డాన్ గా కనిపిస్తే అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కృష్ణంరాజు నటించాడు. తెరపై ఈ ఇద్దరి కాంబినేషన్ లో చూసిన ఫ్యాన్స్ చాలా ఖుషి అయ్యారు.
అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు. కానీ ప్రభాస్ కెరియర్ లో ఓ మంచి చిత్రంగా మాత్రం నిలిచింది. తరువాత ఇద్దరు కలిసి మళ్ళీ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన రెబల్ మూవీలో తండ్రికొడుకులుగా నటించారు. ఈ సినిమాలో తండ్రి కృష్ణంరాజు డాన్ పాత్రలో నటించి మెప్పించారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ ప్రభాస్ ని స్టైలిష్ గా సరికొత్త లుక్ లో ఆవిష్కరించి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసింది. ఈ రెండు సినిమాలు రిజల్ట్ పరంగా ప్రభాస్ కి పెద్దగా సక్సెస్ ఇవ్వకున్నా కెరియర్ మాస్ హీరో ఇమేజ్ ని తీసుకొచ్చి హెల్ చేశాయని చెప్పాలి.
ఇక అదే సెంటిమెంట్ ని ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రాధేశ్యామ్ తో కూడా కొనసాగింది. ఈ సినిమాలో కృష్ణంరాజు గురూజీగా నటించారు. అతని శిష్యుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించాడు. రెండు బలమైన పాత్రలే అయినా కథనం ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవడంతో ఏవరేజ్ మూవీగా మిగిలిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించిన చిత్రంగా మాత్రం చరిత్రలో రాధేశ్యామ్ నిలిచిపోతుందని చెప్పాలి. ఏది ఏమైనా కొడుకుతో కలిసి సూపర్ హిట్ కొట్టాలని ఆకాక్షించిన కృష్ణంరాజుని ఈ మూడు సినిమాలు అంత సంతృప్తిని అయితే ఇవ్వలేదని చెప్పాలి. కానీ కలిసి నటించాను అనే ఆనందాన్ని మాత్రం అందించాయి.