నిన్నటి ఎపిసోడ్‌లో ముకుంద తన తల్లికి మురారి గురించి చెప్పి రెండ్రోజుల గడువు ఇవ్వమని కోరుతుంది. ఆ తర్వాత కూడా మురారి నుంచి ఫోన్ రాకపోతే మేం చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అంటుంది ముకుందతో తన తల్లి. మరోవైపు ఏసీపీ గురించి కూతురికి అర్థమయ్యేలా చెప్తాడు చంద్రశేఖర్. ఆ తర్వాత నవంబర్ 24 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
శివన్న ఆగడాల గురించి కానిస్టేబుల్ మురారికి చెప్తాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టకూడదని ఏసీపీ అంటుండగానే సీఐ చంద్రశేఖర్ వస్తాడు. ఇంత జరిగినా ఎందుకు చెప్పలేదు గురువుగారు అంటాడు మురారి. వాడి సంగతి నాకు వదిలేయండి.. అంటూ సీఐకి భరోసానిస్తాడు మురారి. అంతలోనే అక్కడికి వస్తుంది కృష్ణ. మురారి దగ్గరికి వెళ్లి తనని పరిచయం చేసుకుంటుంది. మీతో మాట్లాడడానికి వచ్చానంటుంది. మిమ్మల్ని త్వరగా వచ్చేలా చేయమని దేవుడ్ని వేడుకున్నానంటూ వంకలు తిరుగుతూ చెప్తుంది కృష్ణ. సూటిగా చెప్పమని మురారి అడగ్గా.. మా నాన్నకు వీఆర్ఎస్ ఇవ్వమని కోరుతుంది కృష్ణ. అలా ఇవ్వడం కుదరదని ఏసీపీ చెప్పగా దానికి ఒప్పుకోదు కృష్ణ. మురారి కూడా అలా ఇవ్వనని తేల్చి చెప్తాడు. ఏం చేసుకుంటావో చేసుకోమంటాడు ఏసీపీ. దాంతో కోపంగా వెళ్లిపోతుంది కృష్ణ. తనని చూసి నవ్వుకుంటాడు మురారి.
మీ అమ్మాయి అంతలా బతిలాడుతుంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చు కద గురువుగారు అంటాడు మురారి. ఆ శివన్న కళ్లల్లో భయం చూశాకే నేను గర్వంగా రిటైర్మెంట్ తీసుకుంటానంటాడు సీఐ. ఆ శివన్నను నేను చూసుకుంటానని మాటిస్తాడు మురారి. కొత్తగా వచ్చినట్టున్నావ్.. శివన్న జోలికి వెళ్లకు అంటూ ఓవ్యక్తి ఏసీపీకి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత సీన్‌లో ముకుంద పెళ్లిచూపులకు రెడీ అవుతుంది. అక్కడ జరిగిందంతా మీ అమ్మ చెప్పిందమ్మా అంటాడు ముకుంద తండ్రి. అలాంటివి ఏమైనా ఉంటే తీసెయ్. మేం చూసిన సంబంధమే నువ్ చేసుకోవాలంటాడు.
ఏసీపీకి సర్పంచ్ శకుంతల ఫోన్ చేసి శివన్న గురించి చెప్తుంది. కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఏసీపీ. అపుడే ముకుంద కూడా మురారికి ఫోన్ చేస్తుంది. కానీ మురారి ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్లీ ట్రై చేస్తుంది ముకుంద. ఈ లోగా పెళ్లి వాళ్లు వస్తే ఏంటి పరిస్థితి అని తన ఫ్రెండ్ అడగ్గా.. నేను ప్రేమించిన వ్యక్తి గురించి వాళ్లకి చెప్పేస్తానంటుంది ముకుంద. అది తప్పని వారిస్తుంది తన ఫ్రెండ్. అతని అభిప్రాయం తెలుసుకోమని సూచిస్తుంది. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే లాస్ట్ కాల్ అనుకో అని సలహా ఇస్తుంది ముకుందకు.
సీన్ కట్ చేస్తే.. మురారి కుటుంబమంతా ముకుంద ఇంటికి వచ్చేస్తారు. భవాని ఆదర్శ్‌ని పరిచయం చేస్తుంది. అక్కడ ముకుంద మురారిని ఇక్కడ మురారి ముకుందని తలుచుకుంటూ బాధపడతారు. ఒక్కసారి నా కాల్ లిఫ్ట్ చేయమని ముకుంద మనసులో వేడుకుంటుంది. అంతలోనే కిందికి రమ్మని పిలుపు వస్తుంది ముకుందకి. బాధతోనే పెళ్లి చూపులకు వస్తుంది ముకుంద. ఇక మీ అమ్మాయి మా ఇంటి కోడలు అయినట్టే అంటుంది భవాని. మరోవైపు మురారి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ప్రియురాలి జాడ తెలుసుకుంటాడు. ఆదర్శ్, ముకుందలు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. మీరు మీ అమాయకత్వం నాకు చాలా బాగా నచ్చాయంటాడు ఆదర్శ్. మరి ముకుందకు ఆదర్శ్‌తో పెళ్లి జరుగుతుందో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..