క్రిష్ ఓ వైపు హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కోసం ఇప్పటికే సిద్ధం అయ్యారు. నవంబర్ మొదటి వారం నుంచి ఏకధాటిగా షెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు క్రిష్ ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కించే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. పాతకాలం నాటి కథలని కాస్తా సినిమాటిక్ ఫ్లేవర్ లోకి తీసుకువచ్చి ప్రెజెంట్ జెనరేషన్ ని అందించే ప్రయత్నం వెబ్ సిరీస్ ల ద్వారా జరుగుతుంది.
ఇప్పుడు క్రిష్ కూడా అదే దారిలో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నవలని వెబ్ సిరీస్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కన్యాశుల్కం నవల నాటకాల రూపంలో ప్రదర్శితం అయ్యేది. ఏపీ వ్యాప్తంగా ఈ నాటకం 90వ దశకంలో చాలా ప్రచారంలో ఉండేది. అలాగే గతంలో ఎప్పుడో దీనిని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అయితే ఈ కథలో ఎమోషన్స్, అప్పటి మనుషుల భావజాలం కనిపిస్తాయి. దానిని వెబ్ సిరీస్ గా తీసుకొస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక ఈ వెబ్ సిరీస్ లో వేశ్య పాత్ర కోసం ఇప్పటికే అనసూయని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే కథలో మెయిన్ లీడ్ లో ఒకటైన పంతులు పాత్ర కోసం టాలెంటెడ్ సీనియర్ యాక్టర్ సాయి కుమార్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అలాగే హీరోయిన్ రోల్ కోసం అంజలిని ఎంపిక చేసినట్లు సమాచారం. బాల్య వివాహాలు, ఆడవాళ్ళని డబ్బులిచ్చి కొనుక్కోవడం అనే అంశం ఈ నవలలో ప్రధానంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో లీడ్ హీరోయిన్ పాత్ర కోసం ప్రస్తుతం ఉన్న స్టార్ నటీమణులలో ఒకరిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.