Kota Srinivasa Rao : ఆరడుగుల ఆజానుబాహుడు.. నటనలో రారాజు.. పేరులోనే కాదు.. అణువణువునా ఉట్టిపడే రాజసం.. నలభై ఏళ్లు పైబడి వెండితెరపై వెలిగిన ధృవతార రెబల్ స్టార్ కృష్ణంరాజు. నిన్న ఉదయం హఠాన్మరణం పాలయ్యారు. అభిమానులను కన్నీటి సంద్రంలో వదిలి మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. చదువుకునే రోజుల నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన తీరును నరసాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలోని గ్రామాలే కాదు.. అప్పటి నుంచి ఆయనతో ఉన్న సినీ తారలు సైతం గుర్తు చేసుకుంటున్నారు. భౌతికంగా ఆయన దూరమైనా నటించిన చిత్రాల ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటారు. జిల్లాకు చేసిన సేవలు అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేయడంతో చిరస్థాయిగా నిలుస్తారు.
కృష్ణంరాజుకు స్వగ్రామం మొగల్తూరుపై మక్కువ ఎక్కువే. సినిమా హీరోగా క్షణం తీరకలేని రోజుల్లోనూ తరచూ వచ్చేవారు. సోదరుడి మరణానికి ముందు వరకు సంక్రాంతి పండుగకు ఏటా క్రమం తప్పకుండా వచ్చేవారు. కోటలో జరిగే వేడుకలకు హాజరయ్యే వారు. బంధుమిత్రులతో గడిపేవారు. ముఖ్యంగా భీమవరంలో ఆయనకు సన్నిహితులు ఎక్కువ. ఆయన భీమవరం వస్తున్నారనే సమాచారంతో మిత్రులు, సన్నిహితులు నివాసానికి చేరుకునేవారు. రాత్రి పొద్దుపోయే వరకు మిత్రులతో గడిపేవారని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో భీమవరానికి భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణి, వాజ్‌పేయీ, బీసీ ఖండూరీ తదితర నాయకులను తీసుకొచ్చిన ఘనత ఆయనకే సొంతం.
Kota Srinivasa Rao : నన్ను సోదరుడిగా భావించేవారు..
కృష్ణంరాజు మృతిపై పలువురు సినీ ప్రముఖుుల స్పందిస్తున్నారు. నేడు కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించిన అనంతరం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిందని కృష్ణంరాజేనని ఆయన వెల్లడించారు. ‘‘కృష్ణంరాజు గారు నన్ను సోదరుడిగా భావించేవారు.. నాకు రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసింది కృష్ణంరాజు గారే. పార్టీ పరంగా కూడా సిన్సియర్‌గా ఉండేవారు. పది మందికి మంచి చేసిన మహానుభావుడు. ఏది చెప్పేవారో అదే చేసేవారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.