AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొడాలి నాని అంటే తెలియని వారు ఉండరు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కొడాలి నాని ఇప్పుడు అదే పార్టీకి ఏకులో మేకులా తయారయ్యాడు. టీడీపీలో నడుస్తున్న కోవర్ట్ రాజకీయాలు నచ్చక స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని జాయిన్ అయ్యారు.
గుడివాడ గడ్డ.. కొడాలి నాని అడ్డా అంటూ వైసీపీలో తనదైన గుర్తింపు సాధించుకుని మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొడాలి నాని తరచూ తెలుగుదేశం పార్టీకి చెందని నాయకులను విమర్శిస్తూనే ఉంటారు. నారా లోకేష్, నారా చంద్రబాబును మాత్రం బూతులతో రెచ్చిపోతూ ఉంటాడు. వైఎస్ జగన్ వీరాభిమానిగా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం మరోమారు స్పందించారు. దసరా పర్వదినాన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మ వారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలంటూ మొక్కుకున్నానని ఆయన తెలిపారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని నాని అన్నారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజలతో పాటు దేవుళ్లు కూడా హర్షించరని ఆయన పేర్కొన్నారు. కులాలు, పార్టీల కోసమో కాకుండా… రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయరాదన్న భావనతోనే సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.