కింగ్ నాగార్జున టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఇక ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలని మొదటి నుంచి కూడా కింగ్ నాగార్జున నటిస్తూ వస్తున్నాడు. బాషతో సంబంధం లేకుండా ఇతర హీరోల సినిమాలలో నాగార్జున నటిస్తూ ఉన్నాడు. కథ డిమాండ్ చేస్తే తాను ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటానని నాగార్జున చాలా సందర్భాలలో చెప్పాడు. అలాగే కొన్ని సినిమాలలో చేసి చూపించాడు కూడా. ఇక సీనియర్ హీరోలలో చాలా మంది సోలోగా ఇమేజ్ తగ్గిపోయింది. భారీ బడ్జెట్ చిత్రాలకి కావాల్సినంత మార్కెట్ ని తీసుకురాలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో వారు యంగ్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇతర హీరోల చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున ఘోస్ట్ సినిమాతో అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలుఉన్నాయి. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నాగార్జున కనిపించారు. ఈ నేపధ్యంలో ఘోస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాగార్జున మల్టీ స్టారర్ చిత్రం చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
ఇది సాధ్యమవుతుందా అని హోస్ట్ అడిగిన ప్రశ్నకి నాగార్జున అవుతుందని సమాధానం చెప్పారు. మహేష్ బాబు ఎప్పుడు రెడీ అంటే నేను అప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఇద్దరికి సెట్ అయ్యే మంచి కథ సెట్ అయితే వీలైనంత వేగంగా ప్రేక్షకులకి కనిపించడానికి రెడీ అని చెప్పేసారు. ఇప్పటికే మహేష్ బాబుతో విక్టరీ వెంకటేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టుతో మల్టీ స్టారర్ చేశారు. ఇక కింగ్ నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కచ్చితంగా భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో మూవీ ఉండే అవకాశం ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.